
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలి
గట్టు: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం గట్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లను కలెక్టర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. గట్టు మండలానికి 780 ఇళ్లు మంజూరయ్యాయని, లబ్ధిదారులు 45 రోజుల్లో పనులను ప్రారంభించి, ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షలను విడతల వారీగా అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే, రైతు భరోసా కింద 4 ఎకరాలపైగా ఉన్న రైతులకు ఇప్పటివరకు రూ.140 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. గట్టు మండలం విద్యారంగంలో వచ్చిన మార్పు ప్రశంసనీయమని కొనియాడారు. తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, గద్వాల మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, ఎంపీడీఓ చెన్నయ్య, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్ ఇందిరమ్మ ఇండ్ల లభ్దిదారులు పాల్గొన్నారు.