
ఉత్సాహంగా క్రీడా పాఠశాలల ఎంపిక పోటీలు
గద్వాలటౌన్: క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. గురువారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో చేపట్టిన ఎంపిక పోటీలను డీవైఎస్‌ఓ జితేందర్ ప్రారంభించారు. విద్యార్థుల ఎత్తు, బరువు, స్టాండింగ్ బ్రాడ్ జంప్, వర్టికల్ జంప్, ప్లెక్సిబిలిటీ టెస్ట్, కేజీ మెడిసిన్ బాల్‌పుట్, 300 మీటర్లు ఫ్లయింగ్ స్టార్ట్, షటిల్ రన్, 800 మీటర్ల పరుగు వంటి తొమ్మిది క్రీడా విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. మండల స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు ఎంపిక చేస్తామని, ఆ జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ జితేందర్ విద్యార్థులనుద్ధేశించి మాట్లాడారు. గెలుపు ఓటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, ఫిజికల్ డైరెక్టర్లు హైమావతి, బీసన్న, అనూష, నరేష్, కవిత, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.