
రైతులు వచ్చే.. పండుగ తెచ్చే !
రాజోళి: ‘గ్రామంలోని రైతులు అందరం కలిసి ఉంటేనే ఏరువాక పండుగ చేసుకుంటాం.. ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటన నేపథ్యంలో కొందరు రైతులను జైలులో వేశారు.. ఏ ఒక్క రైతు కుటుంబం బాధలో ఉన్నా.. అందరం లేకున్నా.. పండుగ ఎలా చేసుకుంటాం..’ అని వారం క్రితం జరుపుకోవాల్సిన ఏరువాక పండుగను పెద్దధన్వాడ గ్రామస్తులు బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం రిమాండ్‌కు వెళ్లిన 12 మందికి బెయిల్ మంజూరు కావడం.. ఆ విషయం గ్రామస్తులకు తెలియడంతో సంబరాలు మొదలయ్యాయి. వెంటనే గ్రామంలో అందరూ సమావేశమై గురువారం ఏరువాక పండుగ ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
పండుగకు సిద్ధం
ఏరువాక పండుగకు ప్రతి ఏడాది గ్రామ దేవతలకు ప్రత్యేకించి సుంకులమ్మ దేవతకు పూజలు చేసి, మొక్కులు చెల్లిస్తారు. ఈ ఏడాది పండుగ చేసుకునేందుకు ముందు మా గ్రామంలో ఎదురైన సంఘటనల నేపథ్యంలో ఏరువాక పండుగను బహిష్కరించుకునున్నామని, కానీ మేం మొక్కుకున్న మొక్కులు మా సుంకులమ్మ తల్లి ఆలకించి, తోటి రైతులకు బెయిల్ వచ్చిందని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. బుధవారం 12 మందికి బెయిల్ మంజూరు కావడంతో గ్రామంలో పండుగ చేసుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. దీంతో పండుగకు అవసరమైన సరుకులు, కూరగాయలు ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రైతులు బబెయిల్‌పై విడుదల అవుతున్నారని, వారికి ఘనంగా స్వాగతం పలకాలని గ్రామంలో చాటింపు వేశారు. వ్యవసాయ, కూలీల పనులకు వెవెళ్లిన వారు తిరిగి ఇంటికి వచ్చిన సమయానికి ఈ చాటింపు వేశారు. దీంతో అందరూ గురువారం పండుగను చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
నేడు ఏరువాక పండుగకు పిలుపునిచ్చిన పెద్దధన్వాడ గ్రామస్తులు
బుధవారం 12 మందికి బెయిల్
రావడంతో గ్రామంలో సంబరాలు
సుంకులమ్మకు మొక్కులు
చెల్లించుకోవాలని చాటింపు