
పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకుల అరెస్ట్
ఎర్రవల్లి: రాజోళి మండలంలోని ఇథనాల్ ప్రభావిత పెద్దధన్వాడ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్తున్న రాష్ట్ర పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఇటిక్యాల ఎస్‌ఐ వెంకటేష్ సిబ్బందితో కలిసి ఎర్రవల్లి కూడలిలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న అలంపూర్ సిఐ రవిబాబు సంఘటనా స్థలానికి చేరుకొని నాయకులను పెద్ద ధన్వాడకు వెళ్లకుండా తిరిగి వెనకకు పంపించేందుకు ప్రయత్నించగా వారు ససేమిరా అన్నారు. దీంతో ఇటిక్యాల పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దధన్వాడ ఇథనాల్ కంపెనీని రద్దు చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ప్రధానకార్యదర్శి నారాయణరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండి సుభాన్, ప్రదాన కార్యదర్శి జక్కా బాలయ్య, వెంకటేష్, లక్ష్మినారాయ ఉన్నారు.
అరెస్టు అక్రమం..
గద్వాల: ఇథనాల్ ప్రభావిత ధన్వాడ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్తున్న పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను అక్రమ అరెస్టును పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజోలి మండలం పెద్ద ధన్వాడలోని ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడిన రైతులను అక్రమంగా జైల్లో పెట్టడం సరికాదని, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
● ఇథనాల్ ప్యాక్టరీ యజమాన్యానికి అమ్ముడుపోయిన ప్రభుత్వం.. రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ముగియడంతో పొలీసులు అలంపూర్ కోర్టులో హాజరు పరిచేందుకు రైతులను తీసుకొచ్చిన సందర్భంలో రైతుల చేతులకు సంకెళ్లు వేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.