
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్య
గద్వాలటౌన్: ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్య అందుతుందని, అధ్యాపకులపై నమ్మకం ఉంచి విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలో చేర్పించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కో–ఎడ్యుకేషన్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. బుధవారం స్థానిక కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యను అందిస్తుందని అన్నారు. నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో బోధన అందిస్తారని వివరించారు. విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాల పంపిణీతో పాటు కళాశాలలో మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల హాజరు 90 శాతానికి పైగా ఉంటేనే వాళ్లు చదువులో రాణిస్తారన్నారు. గతేడాది ఇంటర్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే వెనకబడి పోవడానికి విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడమే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు ప్రోత్సహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీఐఈఓ హృదయరాజు, ప్రిన్సిపల్స్ కృష్ణ, వీరన్న కాంగ్రెస్ నాయకులు రామన్‌గౌడ్, వేణుగోపాల్, సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.