
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
గద్వాలటౌన్: పాత పెన్షన్, కొత్త పెన్షన్ విభజన అంటూ పాత పెన్షన్‌దారులకు ప్రమాదకరంగా మారిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని జిల్లా పెన్షనర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక కార్యాలయంలో జిల్లా పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ నెల 23న దేశవ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సందర్బంగా ‘పెన్షనర్ల పాలిట ఆశనిపాతం’ కరపత్రాలను విడుదల చేశారు. పెన్షనర్ల నుంచి పెద్ద సంఖ్యలో సంతకాలు సేకరించి వాటిని మూడు సెట్లుగా రూపొందించి ప్రధాన మంత్రి కార్యాలయానికి, రాష్ట్ర కార్యాలయానికి, కలెక్టర్‌కు అందించాలని తీర్మానించారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు చక్రధర్, హనుమంతు, వెంకట్రాములు, కృష్ణ, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, సత్యనారాయణ, వీరవసంతరాయుడు, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.