
రైతు చెంతకే అధునాతన పరిజ్ఞానం
రైతునేస్తం కేంద్రాలతో సాగులో మెలకువలపై అవగాహన
● జిల్లాలో ఇప్పటికే 12 రైతు వేదికల్లో అందుతున్న సేవలు
● అందుబాటులోకి రానున్న మరో 24 కేంద్రాలు
● ప్రతి మంగళవారం సూచనలు, సలహాలు ఇవ్వనున్న శాస్త్రవేత్తలు
● నేడు రైతులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి
●
గద్వాల: పంటల సాగు పెట్టుబడులు పెరగడం, కూలీల కొరత, సంప్రదాయ పంటలకు బహిరంగ మార్కెట్‌లో మద్దతు ధర లేకపోవడం వంటి కారణాలతో వ్యవసాయం నేడు కష్టతరమైంది. ఈ సమస్యలను అధిగమించి వ్యవసాయం రైతులకు లాభాసాటిగా చేయాలనే తలంపుతో ప్రభుత్వం రైతునేస్తం కేంద్రాల ద్వారా సేవలందిస్తూ వస్తుంది. అయితే ఈ సేవలకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంభించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుంది. ఇందుకోసం ప్రధానంగా గ్రామీణ రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు అందించి ప్రోత్సహిస్తే లాభసాటిగా అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అధిక శాతం రైతులకు సరైన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో వ్యాపారులు సూచించిన సలహాలు పాటిస్తూ అధిక పెట్టుబడులతో తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు మండల కేంద్రాల్లో ఉండే వ్యవసాయాధికారులను కలిసి పంటల సాగు విధానం గురించి తెలుసుకునేందుకు కష్టతరంగా ఉంది.
మరింత పటిష్టం చేసే దిశగా..
సాగులో సమస్యలను దృష్టిలో పెట్టుకొని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి క్లస్టరుకు ఒక రైతువేదిక నిర్మించింది. వాటిలో ఏఈఓలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతు వేదికలను మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రతి మండలంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా ‘రైతునేస్తం’ ద్వారా రైతువేదికలో వీడియో కాన్ఫరెన్సులను ఏర్పాటు చేసింది. జిల్లాలోని ప్రతి మండలానికి ఒకటి చొప్పున 12 మండలాల్లో రైతునేస్తం కేంద్రాలు ఉండగా.. తాజాగా మరో 24 రైతునేస్తం కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో వీసీ కేంద్రాలను ప్రారంభిస్తుండగా.. జిల్లాలోని 24 వీసీ కేంద్రాలను ప్రారంభిస్తూ మొత్తం 36 కేంద్రాల్లో రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు.
జిల్లాలోని రైతునేస్తం కేంద్రాల్లో పాల్గొనే అధికారులు, ప్రజాప్రతినిధులు..
సద్వినియోగం చేసుకోవాలి..
రైతువేదికలకు వీడియో కాన్ఫరెన్సులు మంజూరు కావడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. జిల్లాలో ఇప్పటికే 12 మండలాల్లో 12 రైతునేస్తం కేంద్రాల ద్వారా రైతులకు సేవలందిస్తుండగా.. తాజాగా మరో 24 రైతునేస్తం కేంద్రాలు మంజూరయ్యాయి. రైతులు రైతు వేదికల వద్దకు వెళ్లి సద్వినియోగం చేసుకోవాలి.
– సక్రియానాయక్, జిల్లా వ్యవసాయాధికారి