
సుదీర్ఘ పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు
ఉండవెల్లి: సుదీర్ఘ 60 ఏళ్ల న్యాయ పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు కేంద్ర, రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం ఉద్యమంలో కీలకం అని ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ పోరాటం మాలలకు వ్యతిరేకం కాదని, అన్ని కులాలకు సమన్వయంగా ఉంటామని అన్నారు. ఆదివారం మండలంలోని కలుగోట్ల గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ విగ్రహావిష్కరణలను మంద కృష్ణతోపాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఐజీ సుమతి ఆవిష్కరించారు. దేశంలో రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ్ ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేశారని, గతంలో వర్గీకరణ అంశాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కమిషన్ వేశారన్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ పోరాటం న్యాయమే అని భావించి.. మాదిగలకు అండగా నిలిచారన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకించలేదంటే ఎమ్మార్పీఎస్ పోరాటమే కారణమన్నారు. ఐజీ సుమతి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి విద్యను అభ్యసించేలా పాఠశాల ముందు మహనీయులను ఏర్పాటు చేశారంటే మార్పు మొదలైందని అర్థమవుతుందన్నారు. అందరు సమానత్వంతో, సామరస్యంగా ఉంటేనే గ్రామం బాగుంటుందని, అందరూ ఉన్నత స్థితికి ఎదిగి జీవితాలలో వెలుగులు తేవాలని కోరారు. అన్ని భాషాలు ఉన్న ఈ దేశంలో అందరిని కలిపిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అని ఐజీ కొనియాడారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ గ్రామంలో యువత ఆదర్శంగా తీసుకుని జ్యోతిరావుపూలే, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మస్తాన్, భీమన్న, రాజు, ఎలీషా, కలుగోట్ల పీఏసీఎస్ చైర్మన్ గజేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.