
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి
గద్వాల: ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, జనగణనలో కులగణన చేయాలని బహుజన రాజ్యసమితి, బీసీ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలో బీసీ ఉపాధ్యాయ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. దేశంలో రోజురోజుకూ ప్రభుత్వ రంగం కుదించుకుపోయి ప్రైవేటు రంగం ఆధిపత్యం చెలాయిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు. అగ్రకులాలు, పెట్టుబడిదారులు వారి తొత్తులలైన పాలకుల వలన ఈ పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ట్యాక్సులు సామాన్యులతో వసూలు చేస్తున్న ప్రభుత్వం వచ్చిన ప్రజాధనాన్ని కొందరు బడాబాబులు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం అమానుషమన్నారు. నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ ద్వారా అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం, బహుజన సమాజానికి పెద్ద ప్రమాదకరంగా మారిందని, అభివృద్ధిని అడ్డుకునేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. సమావేశంలో నాయకులు వాల్మీకి, వినోద్‌కుమార్, హుస్సేన్, వెంకటేష్, కృష్ణయ్య, వెంకట్రాములు, పల్లయ్య, ఇక్బాల్‌పాషా, వెంకటస్వామి, గోపాల్, నర్సింహులు, సిద్ధార్థ కృష్ణ, దామోదర్, వెంకన్న, ప్రవీణ్, శ్రీనివాసులు, వెంకటేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నేతన్నలకు
‘పొదుపు’ పథకం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మర మగ్గాల కార్మికులకు ‘నేతన్న పొదుపు పథకం’ (త్రిఫ్ట్ ఫండ్) పునఃప్రారంభం చేసి నూతన మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు చేనేత, జౌళి శాఖ ఏడీ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. మర మగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 19వ తేదీ వరకు గడువు ఉందని, ఇతర వివరాల కోసం చేనేత, జౌళి శాఖ ఏడీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.