
మోదీ హయాంలోనే సాహసోపేత నిర్ణయాలు
శాంతినగర్: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ హయాంలోనే దేశానికి, ప్రజలకు ఉపయోగపడే సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని వన్ నేషన్– వన్ ఎలక్షన్ ఇన్‌చార్జ్ సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌లో నిర్వహించిన ‘సంకల్పంతో సహకారం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిన సందర్బంగా సంకల్పంతో సహకారం కార్యక్రమం మండల స్థాయిలో చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా మండల స్థాయిలో బూత్ కమిటీలను, శక్తి కేంద్ర ఇన్‌చార్జ్‌లను నియమించాలని సూచించామన్నారు. అనంతరం మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను కార్యకర్తలకు, పట్టణ ప్రజలకు వివరించారు. పెద్దనోట్ల రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం జరిగిందన్నారు. డిజిటల్ పేమెంట్, ఫోన్ పే, యూపీఐ ద్వారా అనేక లావాదేవీలు, ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్ రద్దు, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు, వక్ఫ్ బోర్డు సవరణ చట్టం, ఆపరేషన్ సిందూర్ వంటి నిర్ణయాలు దేశానికి, ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్‌గౌడ్, మండలాధ్యక్షుడు నాగరాజు, నాయకులు నర్సింహ, హరికృష్ణ, వెంకట్రాములు, రాఘవేంద్ర, రంగస్వామి, ఏసు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.