
విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి
గద్వాలటౌన్: ఉపాధ్యాయులు.. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఐదురోజులుగా ఆంగ్లం, గణితం, సాంఘికశాస్త్రం, ప్రత్యేక విద్య స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు కొనసాగిన శిక్షణ కార్యక్రమాలు శనివారం ముగిశాయి. స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న లక్ష్యాలకు అనుగుణంగా బోధన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అందుకోసమే విద్యాశాఖ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి శిక్షణ దోహదపడుతుందని, వారిని మెరుగ్గా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. రానున్న విద్యా సంవత్సరం కృత్రిమ మేధ బోధన అన్ని పాఠశాలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. డీఈఓ అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా సులభమైన బోధన పద్ధతులు అవలంభించాలన్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ ఎస్తేర్‌రాణి, కోర్సు డైరెక్టర్లు బీకే రమేష్, అమీర్‌బాష, వెంకటనర్సయ్య, అంపయ్య తదితరులు పాల్గొన్నారు.