
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
మల్దకల్: పంటల సాగులో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని.. సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు పొందవచ్చని పాలెం శాస్త్రవేత్తలు నళిని, శంకర్ రైతులకు సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని శనివారం మండలంలోని విఠలాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు సాగు చేయాలని సూచించారు. పంటలకు ఆశించే చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. నాణ్యమైన విత్తనాలను వాడి అధిక దిగుబడులను పొందాలని, రసాయన ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతిని పంటలు నష్టపోయే వీలుందన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తప్పనిసరిగా రైతులు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ రాజశేఖర్, ఏఈఓ భాస్కర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.