
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మానవపాడు: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అలంపూర్ జూనియర్ సివిల్ కోర్డు జడ్జి మిథున్ తేజ అన్నారు. శనివారం మండలంలోని మద్దూరు గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చదువు కోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. అలాగే, బాల్యవివాహాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. ఆర్థిక లావాదేవీలు, భూ క్రయవిక్రయాలకు సంబంధించి ఖచ్చితంగా లిఖితపూర్వకంగా పత్రాలు కలిగి ఉండాలని, రైతులు విత్తనాలు, ఎరువులు కొన్నప్పుడు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నష్టపోతే రశీదు ఉండటం వల్ల లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. ఉచిత న్యాయ సహాయం, గృహహింస చట్టం, న్యాయ సేవాసంస్థ అందించే సేవలతోపాటు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, నారాయణరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మధు, గజేంద్రగౌడ్, వెంకటేష్ పాల్గొన్నారు.