
ప్రశాంతంగా పాలిసెట్
● 78 మంది విద్యార్థులు గైర్హాజరు
గద్వాల టౌన్: పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,780 మంది విద్యార్థులకు గాను 1,702 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మిగిలిన 78 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 95.61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉదయం 9 గంటల వరకే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. పది గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి ఇచ్చారు. నిమిషం నిబంధన ఉండటంతో పలువురు విద్యార్థులు చివరి నిమిషంలో ఉరుకులు, పరుగులు తీశారు. ఆయా కేంద్రాలలో ఒక్కో బెంచీకి ఒక్కరే విద్యార్థి పరీక్ష రాసే విధంగా చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల దగ్గర గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రెవెన్యూ, వైద్య, పోలీసు అధికారులు నిరంతంర పర్యవేక్షించారు. పరీక్ష పూర్తయిన తరువాత బందోబస్తు మధ్య పరీక్ష పేపర్లును వాహనాలలో తరలించారు.
ఎల్‌ఆర్‌ఎస్ గడువు పొడిగింపు
గద్వాల: అక్రమ లేఅవుట్లను 25శాతం రాయితీతో క్రమబద్ధీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్ గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడగించినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 47,063 దరఖాస్తులు రాగా వాటిలో 25,710 మందికి 25 శాతం రాయితీతో కూడిన ఎల్‌ఆర్‌ఎస్ సమాచారాన్ని పంపినట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 14,313 మందికి, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 11, 397 మందికి సమాచారాన్ని పంపగా వీరిలో కేవలం 6165 మంది మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
18న చెస్ పోటీలు
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18న జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 9, 11 బాలలకు చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్విస్ లీగ్ పద్ధతిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పోటీలు జరుగుతాయని.. మొదటి, రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల బాలలు పోటీలో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు సంఘం జిల్లా అధ్యక్షుడు (సెల్‌నంబర్ 97034 62115), కోశాధికారి టీపీ కృష్ణయ్య (సెల్‌నంబర్ 99591 54743) సంప్రదించాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
కేటీదొడ్డి: కర్ణాటక రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని, ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు దృష్టి సారించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. మంగళవారం మండలంలోని కొండాపురం గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకు రాష్ట్రం నుంచి వచ్చే రైతులకే ముందుగా టోకన్లు ఇస్తున్నారని ఇక్కడి నెలల నుంచి ఉన్న రైతులకు టోకెన్లు, గన్నీ బ్యాగ్స్ ఇవ్వడం లేదని ఆయన అడిషనల్ కలెక్టర్ నర్సింగ్‌రావుకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. తూకంలో తరుగులు ఎక్కువ తీస్తున్నారని అవకతవకలు జరుగకుండా చూడాలని అన్నారు. ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి వారికి కేటాయించిన రైస్ మిల్లులకు తనలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి స్వప్న, మండల అధ్యక్షుడు శ్రీపాదరెడ్డి, నాయకులు హన్మిరెడ్డి, ఎర్రభీంరెడ్డి, శ్రీనివాసులు, నాగిరెడ్డి, తదితరులు ఉన్నారు.
వేరుశనగ క్వింటా రూ.5,640
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు మంగళవారం 146 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.5640, కనిష్టం రూ.2840, సరాసరి రూ.4470 ధరలు పలికాయి. అలాగే, 42 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5820, కనిష్టం రూ.4590, సరాసరి రూ.5712 ధరలు లభించాయి. 621 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.1856, కనిష్టం రూ. 1509, సరాసరి రూ.1769 ధరలు వచ్చాయి.