
ప్రతీ విద్యార్థి మొక్కలు నాటాలి
భూపాలపల్లి అర్బన్: పర్యావరణ సమతుల్యతలను కాపాడేందుకు ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అవరణంలో సింగరేణి ఆధ్వర్యంలో మొక్కలు నాటి, విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు కొమల, సరోత్తంరెడ్డి, రామకృష్ణ, రాజయ్య, సురేష్, గురుతేజ, చంద్రమౌళి, విద్యార్థులు పాల్గొన్నారు.
జాప్యం లేకుండా
సీఎంపీఎఫ్ సేవలు
భూపాలపల్లి అర్బన్: జాప్యం లేకుండా సీఎంపీఎఫ్(కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్) సేవలను ఉద్యోగులకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ హరిపచౌరి తెలిపారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం సీఎంపీఎఫ్, పెన్షన్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ కమిషనర్ మాట్లాడుతూ.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సీఎంపీఎఫ్ సేవలను పారదర్శకంగా పొందవచ్చని తెలిపారు. కార్మికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. లావాదేవిలు అన్ని సీ–కేర్స్ పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. సీఎంపీఎఫ్, పెన్షన్‌లకు సంబంధించిన క్‌లైమ్స్ త్వరగా పూర్తి చేయడానికి ప్రయాన్స్ అనే పద్దతిని తీసుకొచ్చామని తెలిపారు. సమావేశంలో జీఎం రాజేశ్వర్‌రెడ్డి, సీఎంపీఎఫ్ కమిషనర్ గోవర్ధన్, అధికారులు రవికుమార్, సురేఖ, మారుతి, అన్ని గనుల సంక్షేమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న బీజేపీ
భూపాలపల్లి అర్బన్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికే అని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. కార్మిక చట్టాలని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ.. ఏరియాలోని ఓపెన్ కాస్ట్ 2, 3 ప్రాజెక్ట్‌లలో బుధవారం గేట్ మీటింగ్ నిర్మించారు. ఈసందర్భంగా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కొరిమి రాజ్‌కుమార్, పసునూటి రాజేందర్, బడితల సమ్మయ్య, కంపేటి రాజయ్య మాట్లాడారు. కొన్ని సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా బీజేపీ ప్రభుత్వం విభజించి కార్మిక హక్కులను హరిస్తుందని వారు మండిపడ్డారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మోటపలుకుల రమేష్, సింగ్, చేరాలు, మధుకర్‌రెడ్డి జోగబుచ్చయ్య, రాంచందర్, మధు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆటో ప్రచార జాతా కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు బందు సాయిలు ప్రారంభించారు. దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలని సాయిలు కోరారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, దేవేందర్, రాజయ్య, శేఖర్, రవికుమార్, రాజేందర్ పాల్గొన్నారు.
కాకతీయ యూనివర్సిటీ
స్నాతకోత్సవానికి రండి
● గవర్నర్‌ను కలిసి ఆహ్వానించిన వీసీ
కేయూ క్యాంపస్: ఈ నెల7వ తేదీన జరగనున్న కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని బుధవారం వీసీ కె.ప్రతాప్‌రెడ్డి హైదరాబాద్‌లో రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కలిసి ఆహ్వానించారు. స్నాతకోత్సవం నిర్వహణ సమయం, గోల్డ్‌మెడల్స్, పీహెచ్‌డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం వివరాలు, కాన్వొకేషన్ ప్రొసీడర్‌ను గవర్నర్‌కు తెలియజేశారు. గవర్నర్ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు ఓకే చెప్పారని సమాచారం. వీసీ వెంట కేయూ ఓఎస్‌డీ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ ఉన్నారు.

ప్రతీ విద్యార్థి మొక్కలు నాటాలి