
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలి
భూపాలపల్లి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులకు సూచించారు. గురువారం భూపాలపల్లి మండలం కొత్తపల్లి (ఎస్‌ఎం) గ్రామంలో ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేస్తుందని కలెక్టర్ తెలిపారు. మండలంలోని కాల్వపల్లి వద్ద ఉన్న ఇసుక స్టాక్‌పాయింట్ అందుబాటులో ఉందని, లబ్ధిదారులు అక్కడినుంచి తీసుకోవచ్చని స్పష్టంచేశారు. ఇంటి నిర్మాణం పనులను దశలవారీగా పూర్తి చేస్తూ సంబంధిత ఫొటోలు, వివరాలను వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదుచేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం నాణ్యతకు రాజీలేకుండా పనిచేయాలని, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. మురుగు నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో
నాణ్యమైన విద్యాబోధన
కొత్తపల్లి (ఎస్‌ఎం) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పాఠాలు చదివించారు. విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తి పెరిగేలా, అభ్యసనా సామర్థ్యాలు మెరుగయ్యేలా ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం అదనపు సమయం కేటాయించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తక్కువగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ పిల్లలను చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఎంపీడీఓ నాగరాజు, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాయలింగు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
ఇళ్ల పనుల పరిశీలన

ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలి