
ఒంటేరు వాగుపై కల్వర్టు
వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఆలుబాక పంచాయతీ పరిధిలోని ముత్తారం గిరిజనులు తమ సొంత ఖర్చులతో ఒంటేరు వాగుపై కల్వర్టును గురువారం నిర్మించుకున్నారు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవటంతో పాటు వాగుపై వంతెన లేకపోవటంతో ముత్తారం గ్రామస్తులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గ్రామ పెద్దల నిర్ణయంతో గ్రామంలోని 120 కుటుంబాల వారు ఒకో కుటుంబానికి రూ.4వేల చొప్పున వసూలు చేసుకుని కల్వర్టు నిర్మాణంతో పాటు రోడ్డు పనులను శ్రమదానం చేసి నిర్మించుకున్నారు. కల్వర్టు, రోడ్డు సౌకర్యం కల్పించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు.