
వ్యాధుల కాలం.. జాగ్రత్త
సీజన్‌లో మార్పులతో జబ్బులు
● గాలి, నీరు కలుషితంతోనే సమస్య
● ముందస్తు చర్యలు తీసుకుంటే సేఫ్..
కాళేశ్వరం: వారంరోజులుగా జిల్లావ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పల్లెల నుంచి పట్టణాల వరకు రోడ్లు చిత్తడిగా మారి అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. పారిశుద్ధ్యం, తాగునీటి కలుషితం సమస్యతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ముందస్తు చర్యలు తీసుకుంటే అనారోగ్యాల పాలుకాకుండా సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించకుంటే టైఫాయిడ్, మలేరియా, డెంగీ, డయేరియా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది.
నీరు కలుషితం..
వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు ప్రతి సంవత్సరం కాటారం డివిజన్‌లోని పల్లెలు జ్వరంతో మంచం పడుతున్నాయి. ప్రధానంగా వర్షాకాలంలో కలుషిత నీరు తాగడంతో వ్యాధుల బారిన పడుతున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి మహదేవపూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం, పలిమెల మండలాల్లోని చాలా గ్రామాల్లో తాగునీరు కలుషితంతో జ్వరాల బారిన పడుతున్నారు. వర్షపు నీరు నిలవడంతో దోమలు వృద్ధి చెంది కూడా సమస్య తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆస్పత్రుల్లో జ్వర పీడితుల సంఖ్య రెండు రోజులుగా పెరుగుతోంది.
అప్పుడు 16మంది మృతి..
2016 ఆగస్టులో బెగుళూర్ గ్రామంలో 16మంది వరకు విష జ్వరాలు, డెంగీతో మృతి చెందారు. నిల్వ ఉంచిన కుండలు, మురుగు కాలువలు, చెరువు ప్రాంతాల్లో ఏడీస్ ఈజిప్టి(డెంగీ కారకం దోమ) ఎనాఫిలిన్(మలేరియా కారకం దోమ) క్యూలెక్స్ (బోదకాలు కారకం దోమ)లను మలేరియా వైద్యాధికారులు గుర్తించి చర్యలు చేపట్టారు. వైద్యాధికారులు ఫాగింగ్, ఫైరిమైత్రిన్, అబాట్, ఏసీఎం స్ఫ్రేలు ప్రతీ గ్రామంలో ప్రతి నిత్యం చల్లాలి. ఈ వర్షాకాలంలో కూడా పలు రకాల స్ప్రేలు చల్లుతుండాలి. చెరువులో దోమల లార్వా తినడానికి ‘గంబూషియా’ చేపలను వదలాలి.
జాగ్రత్తలు పాటించాల్సిందే..
కాచి చల్లార్చిన నీటినే తాగాలి
వేడిగా ఉన్న ఆహార పదార్థాలను
తీసుకోవడం మంచిది
ఆహార పదార్థాలపై
ఈగలు వాలకుండా చూసుకోవాలి
దోమలు వృద్ధి చెందకుండా మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి
ఇంటితో పాటు ఇంటి ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలి
ఇంట్లో ఉండే నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ శుభ్రం చేసుకోవాలి
మురుగు నీటి నిల్వల పై కిరోసిన్ చల్లాలి
ఇంటి పరిసరాలకు పందులు రాకుండా చూసుకోవాలి
పరిశుభ్రత పాటించాలి..
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలం ఆరంభంలో వాతావరణ మార్పులతో వ్యాధులు వస్తాయి. నీరు నిల్వ ఉండకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. చిన్నారులు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధులు ఎక్కువగా ప్రబలే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా మందుల స్ప్రేలను చల్లుతున్నాం. జూన్ మొదటివారం నుంచి సేవలు మొదలు పెట్టాం.
– సుస్మిత, పీహెచ్‌సీ వైద్యాధికారి, కాళేశ్వరం

వ్యాధుల కాలం.. జాగ్రత్త

వ్యాధుల కాలం.. జాగ్రత్త