
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
భూపాలపల్లి అర్బన్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి నిర్మూలనకు కృషి చేయాలని ఎకై ్సజ్ ఎస్సై రబ్బాని కోరారు. మున్సిపల్ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం డ్రగ్స్ నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రబ్బాని హాజరై మాట్లాడారు. మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి, డ్రగ్స్ ఇతర మాదక ద్రవ్యాలను వినియోగించిన, సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఎవరైనా మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు, పాఠశాలల ఉపాధ్యాయులకు సమాచారం అందించి మాదకద్రవ్యాల నిరోధానికి సహకరించాలని కోరారు. అనంతరం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. జంగేడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్‌కుమార్, ఉపాధ్యాయులు, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.