
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం
భూపాలపల్లి: వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి సంఘాలను ఎంపిక చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. రైతు ఉత్పత్తి సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలకు డ్రోన్స్ పంపిణీపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్‌లో వ్యవసాయ, ఉద్యాన, సహకార, డీఆర్‌డీఓ, నాబార్డ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు డ్రోన్ల వినియోగంపై చర్యలు వేగవంతం చేయాలని అన్నారు. జిల్లాలో పంపిణీ చేసేందుకు 12 డ్రోన్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని మండలాల వారీగా ఒక్కో మండలానికి ఒక డ్రోన్ చొప్పున పంపిణీ చేయాలన్నారు. ఇందుకోసం విజయవంతంగా నడుస్తున్న సంఘాల సభ్యులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఏడీఏ బాబు, ఉద్యానశాఖ అధికారి సునిల్, డీఆర్‌డీఓ బాలక్రిష్ణ పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనకు
చర్యలు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీలోని తన చాంబర్‌లో విద్యా, టీజీడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 5 జూనియర్ కళాశాలల్లో కనీస సౌకర్యాల కల్పనకు రూ. 41.07 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు అందజేయాలని ప్రిన్సిపల్‌లను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకన్న, డీఈఓ రాజేందర్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ