
అర్హత ఉన్నవారికే పదవులు
మొగుళ్లపల్లి: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే తగిన గుర్తింపు లభిస్తుందని, అర్హతలు ఉన్న వారికే పదవులు వస్తాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అమ్మగార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి అధ్యక్షతన అన్ని గ్రామాల ముఖ్యనేతలతో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ ప్రక్షాళనలో పీసీసీ పరిశీలకుల బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. పేదలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతీఒక్కరు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 38 మందికి సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు రూ.12,60,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సంస్థాగత ఎన్నికల జిల్లా పరిశీలకులు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, మాసంపెల్లి లింగాజి, రాష్ట్ర నాయకుడు కటంగూరి రాంనరసింహారెడ్డి, అన్ని గ్రామాల ముఖ్య నేతలు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
పుష్కరాల భక్తులకు అన్నదానం
భూపాలపల్లి రూరల్: కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నదానం కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ జాతీయ రహదారి పక్కన అన్నదానం కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని అధికారులు, స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15వ తేదీ (గురువారం) నుంచి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నదానం నిర్వహించాలని, పార్కింగ్‌తో పాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట కమలాపూర్ మాజీ సర్పంచ్ తోటసంతోష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్, యువజన నాయకులు పిప్పాల రాజేందర్, జిల్లా నాయకులు అప్పం కిషన్, తోట రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు