
వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
జనగామ రూరల్: ప్రజల భాగస్వామ్యంతో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మంత్రి కొండా సురేఖతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతీ ఇంటికి మొక్కలు అందించడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటికే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించామన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు. అలాగే జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ వీసీలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భూగర్భ జల సంరక్షణ అందరి బాధ్యత
భూగర్భ జల సంరక్షణ అందరి బాధ్యతని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. తక్కువ ఖర్చుతో ఇంకుడుగుంతల నిర్మాణం, మ్యాజిక్ సోక్ పిట్స్, ఫారమ్ పాండ్ నిర్మాణాలకు సంబంధించిన పోస్టర్‌ని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి కలెక్టరెట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కలెక్టరేట్‌లో ఇంకుడుగుంత నిర్మాణం ప్రారంభించారు. భూగర్భ జలసంరక్షణకు సహకరించాలన్నారు.
ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి కావాలి
దేవాదుల ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి కావా లని స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అ న్నారు. మంగళవారం దేవాదుల ఎత్తిపోతల పనుల ప్రగతిపై కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ అశ్వరావుపల్లి కుడి ప్రధాన కాల్వ పనులను నెల రోజులలో పూర్తి చేయాలన్నారు. పంపింగ్‌లో ఎలాంటి సమస్యలు లేకుండా ముందుగానే రిజర్వాయర్లు నింపి పెట్టుకోవాలన్నారు. ధర్మసాగర్ నుంచి నీటి డిస్ట్రిబ్యూషన్‌పై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ధర్మసాగర్, ఘన్‌పూర్, నవాబ్‌పేట, అశ్వరావుపల్లి రిజర్వాయర్లను 20 రోజుల్లో నింపాలని, ధర్మసాగర్ నార్త్, సౌత్ కెనాల్స్ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు చేరాలన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సీఈ అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ లావణ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు, ఆర్డీఓలు, ఇరిగేషన్ శాఖ అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
వీసీలో సీఎస్ రామకృష్ణారావు

వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి