
డ్రగ్స్ రహిత కమిషనరేటే లక్ష్యం
● సీపీ సన్‌ప్రీత్‌సింగ్
వరంగల్ క్రైం: డ్రగ్స్ రహిత వరంగల్ పోలీస్ కమిషనరేట్‌గా గుర్తింపు సాధించడమే మనందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్‌పోస్టర్లను మంగళవారం సీపీ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను సమాజం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. వారోత్సవాల్లో భాగంగా విద్యాసంస్థల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో డ్రగ్స్‌పై అవగాహన కల్పించడంతో పాటు, ర్యాలీలు, డ్రాయింగ్, వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా 87125 84473 నంబ ర్‌లో సమాచారం అందించాలని సూచించారు. కా ర్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సీసీఆర్‌బీ ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.