
అను‘బంధం’ దూరమై..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అవ్వ..అయ్య..అన్న..తమ్ముడు..వదిన..మరదలు..అక్క..బావ.. పిల్లలు.. ఇలా అందరూ కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబాలు పల్లెల్లో గతంలో కనిపించేవి. ఒక్క పూటకు అందరికీ భోజనాలు సరిపోవాలంటే పెద్ద గంజులో అన్నం, కూర వండి కలిసి తినేవారు. ఆ ఇళ్లలో నిత్యం పండుగ వాతావరణం కనిపించేది. కుటుంబంలో ఎవరికై నా అనారోగ్యం వస్తే అందరూ దగ్గర ఉండి ధైర్యం చెబుతూ వ్యాధి తగ్గే వరకు చుట్టూ తిరుగుతూ ప్రతీ క్షణం బాగోగులు చూసుకునేవారు. కానీ నేడు భార్య, భర్త, పిల్లలు చాలు అంటున్న కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ కుక్కర్‌లో అన్నం.. ప్రెషర్ కుక్కర్‌లో కూరలు వండుకొని ఎవరికీ తీరినప్పుడు వారు తినేసి ఉద్యోగం, ఉపాధిబాట పడుతున్నారు. జ్వరమొచ్చినా.. జలుబు వచ్చినా పరామర్శించే వారు కరువవుతున్నారు. మనోధైర్యం చెప్పేవారు కనిపించడం లేదు. ఫలితంగా చిన్నపాటి సమస్యలకే ఇంట్లో గొడవలు పెట్టుకోవడం.. అవి కాస్త తీవ్రమైతే ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.
పెనవేసుకునే ఉమ్మడి బంధం
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు భార్యభర్తల మధ్య పొరపచ్చాలు వస్తే పెద్దలు సర్ది చెప్పేవారు. దీంతో సమస్య అక్కడికక్కడే పరిష్కారమయ్యేది. కానీ నేడు హితబోధ చేసే పెద్దలు దగ్గర ఉండకపోవడంతో దంపతుల మధ్య చిన్నపాటి గొడవలకే మనస్పర్థలకు పోతూ విడిపోవాలనే ఆలోచన లేదంటే లోకం నుంచే వెళ్లిపోవాలనే దురాలోచనతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే బంధాలు.. అనుబంధాలు బలహీనమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్ సిటిజెన్స్ తాము గడిపిన ఉమ్మడి కుటుంబాల నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఇప్పటి పరిస్థితులను చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు
మారిన పరిస్థితుల్లో చిన్నకుటుంబాలుగా జీవనం
రక్తసంబంధీకుల మధ్య అడ్డుగోడలు
ఉద్యోగం, ఉపాధి వేటలో ఇతర ప్రాంతాలకు..
గతాలను నెమరువేసుకుంటున్న నాటితరం