
సీనియర్ పాత్రికేయుడి హఠాన్మరణం
సిరిసిల్లటౌన్: సీనియర్ పాత్రికేయుడు గర్దాస్ ప్రసాద్(43) శనివారం తెల్లవారు జామున హఠాన్మరణం చెందారు. వివిధ సంస్థల్లో పదేళ్లుగా పనిచేసిన ఆయన సిరిసిల్ల నియోజకవర్గం టీవీ 9 కంట్రిబ్యూటర్‌గా నాలుగేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో ఉదయం గుండెపోటుకు గురికాగా కుటుంబ సభ్యులు సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనలతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రసాద్‌కు భార్య రేవతి, కూతుళ్లు సంజన(19), సిరిచందన(16), కొడుకు శివేంద్ర(11) ఉన్నారు.
సంతాపాలు..ఆర్థిక సాయం
ప్రసాద్ మృతిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సంతాపం ప్రకటించారు. రూ.50వేల ఆర్థికసాయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ రూ.25వేలు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ రూ.10వేలు అందజేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు రూ.50వేల ఆర్థికసాయాన్ని పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు చేతుల మీదుగా అందజేశారు. ప్రెస్‌క్లబ్‌లో అధ్యక్షుడు, కార్యదర్శి ఆకుల జయంత్‌కుమార్, ఆడెపు మహేందర్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం, టి.వి.నారాయణ, వూరడి మల్లికార్జున్, ప్రెస్‌క్లబ్ కార్యవర్గం, పాత్రికేయులు నివాళి అర్పించారు.

సీనియర్ పాత్రికేయుడి హఠాన్మరణం