
రైతులకు ‘ముందస్తు’ సూచనలు
● పొలాసలో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రం ● ఐదు రోజుల ముందే అన్నదాతకు సలహాలు ● మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్
జగిత్యాలఅగ్రికల్చర్: భూమి దున్నేది మొదలు.. పంట పండించి మార్కెట్లో అమ్మేవరకు వాతావరణ పరిస్థితులు రైతులకు అగ్ని పరీక్షగా మారుతున్నా యి. ఓ ఏడాది రుతుపవనాలు ముందుగా వస్తే.. మరో ఏడాది ఆలస్యంగా వస్తాయి. అయితే పొడి వాతావరణం.. లేకుంటే బెట్ట పరిస్థితులు, వరదలు, తుపాన్లు, అకాల వర్షాలు, వడగండ్ల వానలు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ క్రమంలో అన్నదాతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు వాతావరణ సూచనలు, సలహాలు అందించేందుకు జగిత్యాలలోని పొలాసలో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రం ఏర్పాటు చేశారు. భారత వాతావరణ శాస్త్ర విభాగం, వ్యవసాయ పరి శోధన సంస్థ, శాస్త్ర, సాంకేతిక విభాగం, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో వాతావరణ విభా గాన్ని ప్రారంభించారు. ఈ విభాగం ద్వారా వాతా వరణ పరిస్థితులను ఐదురోజుల ముందుగానే తె లు సుకునే వెసులుబాటు ఉంది. కచ్చితమైన సమాచారం కోసం ఆధునాతన టెక్నాలజీతో రూపొందించిన నాలుగైదు పరికరాలను బిగించారు.
● ప్రతిరోజూ ఉదయం 7.16గంటలకు.. మధ్యాహ్నం 2.16 గంటలకు వాతావరణ కేంద్రం పరిధిలోని సూర్యరశ్మి, గాలిలో తేమ, ఉష్ణోగ్రత, గాలి వేగం, ఏ దిశగా గాలి వీస్తున్నదనే విషయాలను సేకరించి వాతావరణ కేంద్రం వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేస్తారు.
● పూర్తిగా కంప్యూటరీకరించిన కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు మరికొంత డాటా ఆటోమెటిక్‌గా భారత వాతావరణ కేంద్రానికి వెళ్తుంది.
● సెలవు లేకుండా 365 రోజులూ ఈ వాతావరణ కేంద్రం పనిచేస్తుంది.
● వర్షం, గాలి వేగం, ఉష్ణోగ్రతల పరికరాలన్ని ఒకేదాంట్లో ఇమిడి ఉంటాయి.
● రానున్న ఐదురోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయాలు ఈ ఆటోమెటిక్ కేంద్రం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.
● ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్‌ను మీడియా, వ్యవసాయ శాఖ అధికారులకు పంపిస్తారు.
● అప్పటి వాతావరణాన్ని బట్టి రైతులు పంటల సాగులో ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలు కూడా వివరిస్తారు.
● ఐదు రోజుల్లో వర్షపాతం ఎలా ఉంటుంది.. గాలి వేగం ఎంత.. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి వంటి విషయాలు ఈ బులెటిన్‌లో ఉంటాయి.
● ముందస్తు వాతావరణ సమాచారం తెలియడం ద్వారా రైతులు అప్రమత్తమై పంట నష్టాన్ని, ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది.