
అడవికి ఆపద
సిరిసిల్ల: జిల్లాలో అటవీ భూములు కబ్జాకు గురవుతున్నా.. ఆఫీస్‌ల్లోనే అటవీశాఖ అధికారులు రెస్ట్ తీసుకుంటున్నారు. రికార్డుల్లోనే అడవిని రక్షిస్తున్నారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్–2023 ప్రకారం 251 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 2020లో 22.50 శాతం ఉన్న పచ్చదనం ఏకంగా 20.45 శాతానికి పడిపోయినట్లు అటవీశాఖ గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వం పోడుభూములకు పట్టాలు ఇస్తుందనే నమ్మకంతో అటవీ శివారు పల్లెల్లో పోడు పేరిట ఫారెస్ట్‌ను పాడుచేసే పనులు చేస్తున్నారు. ఇందుకు క్షేత్రస్థాయిలో పనిచేసే అటవీశాఖ అధికారులు, సిబ్బంది అండగా నిలుస్తున్నారు. ఎకరానికి రూ.50వేల నుంచి రూ.1.50 లక్షల వరకు దండుకుంటూ అక్రమార్కులకు అధికారులే అండగా నిలుస్తున్నారు. అటవీ భూములను ఆక్రమించడం, సాగుచేయడం నేరమని తెలిసినా కొందరు గొడ్డళ్లు, ట్రాక్టర్లతో అడవికి ఎసరుపెడుతూనే ఉన్నారు. కొత్తపేట, మల్యాల, సనుగుల, రామారావుపల్లి, గోవిందరావుపల్లి, వట్టిమల్ల, గర్జనపల్లి, రంగంపేట శివా రుల్లో సుమారు 251 ఎకరాల్లోని జంగల్‌ను నరికేశారు. మార్కెట్‌లో ఆ భూముల విలువ రూ.37.65 కోట్ల మేరకు ఉంటుంది.
కళ్లు తెరవకుంటే..
జిల్లా అధికారులు కళ్లు తెరవకుంటే పచ్చని అడవి ఆక్రమణల పాలై పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏటా రూ.కోట్లు వెచ్చించి హరితహారం చేపడుతున్నా నాటే మొక్కల కంటే నరికేస్తున్న చెట్ల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఉన్న వారు ఇప్పటికే ఎకరాల కొద్ది భూములను ఆక్రమించి.. పోడు పేరిట అడవులకు కీడు చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవాలను గుర్తించి చర్యలు తీసుకుంటే భవిష్యత్‌లో అటవీ భూములకు రక్షణ కల్పించినట్లు అవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో పోడుపట్టాలు అటవీ భూముల ఆక్రమణలు ఎలా ఉన్నా.. కొత్తగా అడవికి ఆపద రాకుండా రక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది.
స్పందించని అటవీశాఖ అధికారులు
జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలపై జిల్లా ఇన్‌చార్జి డీఎఫ్‌వోను ఫోన్‌లో ‘సాక్షి’ సంప్రదించగా స్పందించలేదు. కొత్తగా సాగులోకి వచ్చిన అటవీభూముల వివరాలపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆమె ఫోన్ ఎత్తలేదు. ఏది ఏమైనా జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలు నిరాటంకంగా సాగుతున్నాయి.
అటవీ స్వరూపం..(అటవీ శాఖ గణాంకాలు)
గ్రామాలు: 260
అటవీ సమీప గ్రామాలు: 64
అటవీ విస్తీర్ణం : 390.85 చదరపు కిలోమీటర్లు
మధ్యస్థ దట్టమైన అటవీ ప్రాంతం : 113.26 చదరపు కిలోమీటర్లు
బహిరంగ అటవీ ప్రాంతం : 185.07 చదరపు కిలోమీటర్లు
పోడు అటవీ ప్రాంతం : 15.32 చదరపు కిలోమీటర్లు
అడవి కాని అటవీ ప్రాంతం : 76.06 చదరపు కిలోమీటర్లు
అడవుల్లో నీటి వనరులు : 1.14 చదరపు కిలోమీటర్లు
పచ్చదనం శాతం : 20.45
ఉండాల్సిన పచ్చదనం: 33 శాతం
ఇది రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం కొత్తపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు 2015లో నిర్మించిన చెక్‌డ్యాం. ఈ చెక్‌డ్యామ్‌లో నీరు నిల్వ ఉండి.. వన్యప్రాణులకు దాహార్తి తీర్చుతుంది. ఈ చెక్‌డ్యామ్ పక్కనే ఓ పది ఎకరాలు మైదానంగా అటవీభూమి ఉంది. చెక్‌డ్యామ్‌లో నీరు ఉంటే.. ఆ భూమి సాగులోకి రాదు. దీంతో స్థానికుడు ఒకరు చెక్‌డ్యామ్‌లో ఇసుక నిండిన భాగాన్ని తవ్వేశాడు. తన ట్రాక్టర్‌తోనే కోర (కయ్య) కొట్టాడు. గతేడాది కురిసిన వర్షాలకు చెక్‌డ్యామ్ తెగిపోయింది. నీరు నిల్వ లేకుండా పోయింది. ప్రజాధనం వరదపాలైంది.
చెట్లు.. చెక్‌డ్యామ్‌లను కూల్చివేస్తూ.. అటవీ భూమికబ్జా ఫారెస్ట్ ప్లాంటేషన్‌నే దున్నేశారు ఆఫీస్‌లు దాటని ఫా‘రెస్ట్’ అధికారులు
ఈ ఏడాది కొత్తగా 251 ఎకరాల్లో ఫారెస్ట్ ఆక్రమణలు పోడు భూములకు పట్టాల ఆశతో చెట్లను కొట్టేస్తున్నారు
ఆ భూమి విలువ రూ.37.65 కోట్లపై మాటే ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి
ఇది కొత్తపేట శివారులోనే చెక్‌డ్యామ్‌ను కూల్చివేసిన ప్రదేశం. చెక్‌డ్యామ్ లేకుండా పోవడంతో పది ఎకరాల ఫారెస్ట్ భూమి సాగులోకి వచ్చింది. ట్రాక్టర్ ఉండడంతో ఇటీవల అటవీ భూమిని దున్నేసి పత్తివిత్తనాలు పెట్టాడు. అటవీ భూమిలోనే గుట్టుగా బోరు వేశాడు. నీరు బాగానే పడింది. దూరంగా ఉన్న విద్యుత్ స్తంభం నుంచి వైర్లు లాగి మోటారు పెట్టాడు. సదరు చెక్‌డ్యామ్ కూల్చిన కొత్తపేట వ్యక్తి పది ఎకరాల ఆసామి అయ్యాడు. ఆ భూమి విలువ ఇప్పుడు మార్కెట్‌లో రూ.కోటిన్నర.
ఇది వీర్నపల్లి మండలం గర్జనపల్లి గిరిజనతండా శివారులో ఇటీవల ఇలా చెట్లను తొలగిస్తున్నారు. ఆ తొలగించిన చెట్ల కొమ్మలు అక్కడే ఎండిపోయిన తరువాత వంట చెరుకుగా వాడుతున్నారు. మరో ఏడాది ఆ భూమిని దున్నుకుని పంటను సాగు చేసుకునేందుకు వీలుగా వా డుకుంటున్నారు. సహజసిద్ధంగా అడవి లో ఎదుగుతున్న చెట్లను ఇలా కొట్టేశారు.
వీరంతా వీర్నపల్లి మండలం రంగంపేట వాసులు. హరితహారంలో భాగంగా అటవీశాఖ అధికారులు మొక్కులు నాటేందుకు బుధవారం వెళ్లగా ఆ భూములు తమవి అంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. గిరిజనులకు పోడుపట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వెనకబడిన వర్గాలకు చెందిన తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏళ్లుగా ఆ భూముల్లో పంటలు పండిస్తున్నామని, ఇప్పుడు మొక్కలు నాటితే తమకు బతుకుదెరువు లేదని వాదించారు. ప్రస్తుతం 132 ఎకరాల్లో అటవీశాఖ మొక్కలు నాటకుండా రైతులు పంట వేయకుండా అలాగే ఉంది.. ఇవి ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైన వాస్తవాలు.

అడవికి ఆపద

అడవికి ఆపద

అడవికి ఆపద

అడవికి ఆపద