చినుకు చిన్నబోయింది.. | - | Sakshi
Sakshi News home page

చినుకు చిన్నబోయింది..

Jun 24 2025 3:35 AM | Updated on Jun 24 2025 3:35 AM

చినుక

చినుకు చిన్నబోయింది..

● చిరుజల్లులకే పరిమితం ● మొలకెత్తని విత్తనాలు ● అష్టకష్టాలు పడుతున్న రైతులు ● భారీ వర్షం కోసం ఎదురుచూపు ● జూలైపైనే అన్నదాతల ఆశలు

జగిత్యాలఅగ్రికల్చర్‌: వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. జూన్‌ నెల చివరికి వచ్చినా ఇప్పటివరకు పెద్ద వర్షం జాడ లేకుండాపోయింది. కేవలం చిరుజల్లులకే పరిమితం అవుతుండటంతో రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కొద్దిరోజులుగా పొడి వాతావరణంతోపాటు 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది 15 రోజులు ముందుగానే రుతుపవనాలు రావడం.. వర్షాలు ఓ మోస్తరుగా కురవడం, బావుల్లో ఉన్న నీటితో పంట పండించుకోవచ్చనే ఆశతో రైతులు అక్కడక్కడ పసుపు, పెసర, మొక్కజొన్న, కంది, పత్తి విత్తనాలు వేశారు. మరికొన్ని చోట్ల వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం.. పొడి వాతావరణం కారణంగా భూమిలో తేమ ఆవిరై విత్తనాలు మొలకెత్తే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలిలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత మొదలైంది.

వర్షపాతం అంతంతే..

జిల్లాలో జూన్‌ 23 వరకు సాధారణ వర్షపాతం 115.2 మిల్లీమీటర్లు. కానీ.. ఇప్పటివరకు 78.1 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోల్చితే ఇది 37.1 మిల్లీమీటర్లు తక్కువ. 15 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అది కూడా చిరుజల్లులకే పరిమితమైంది. రెండు, మూడు రోజులకోసారి 2 నుంచి 4 మిల్లీమీటర్ల మేర తేలికపాటి వర్షాలు కురవగానే రైతులు విత్తనాలు వేశారు. అవి ఇప్పుడు మొలకెత్తడం లేదు. జిల్లాలో సాధారణ వర్షపాతంలో పోల్చితే జగిత్యాలలో 34 శాతం, జగిత్యాల రూరల్‌లో 16, రాయికల్‌లో 24, సారంగాపూర్‌లో 13, మల్యాలలో 25, పెగడపల్లిలో 51, కొడిమ్యాలలో 26, కోరుట్లలో 24, మేడిపల్లిలో 50, మెట్‌పల్లిలో 47, ఇబ్రహీంపట్నంలో 32, బుగ్గారంలో 50, ధర్మపురిలో 34, బీర్‌పూర్‌లో 59, గొల్లపల్లిలో 54, వెల్గటూర్‌లో 41, ఎండపల్లిలో 51, మల్లాపూర్‌లో 19, భీమారంలో 21 శాతం చొప్పున తక్కువ వర్షపాతం నమోదైంది. కథలాపూర్‌లో సాధారణ వర్షపాతం పడింది. వాస్తవానికి నైరుతి రుతుపవనాలతో జూన్‌ 15 నుంచి సెప్టెంబర్‌ వరకు వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది జూన్‌ ప్రారంభంలోనే వర్షాలు కురవడంతో రైతులు విత్తనాలు వేశారు.

డ్రిప్‌ ద్వారా పంటలకు నీరు

భూమిలో తేమ లేక విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకెత్తినని మాడిపోతుండటంతో రైతులు పంటలకు నీరు అందించే పనులు ప్రారంభించారు. పసుపు, మొక్కజొన్న వంటి తోటలకు డ్రిప్‌, మిగతా అరుతడి పంటలకు వ్యవసాయ బావుల ద్వారా నీరు అందిస్తున్నారు. కొంతమంది రైతులు ఇంకా విత్తనాలు వేయాల్సి ఉంది. వారంతా వర్షాల కోసం వేచి చూస్తున్నారు. నిజానికి జూలైలో ఎక్కువ వర్షాలు కురుస్తుంటాయి. దీంతో రైతులు జూలైలో వర్షాలపైనే నమ్మకం పెట్టుకున్నారు. బావుల్లోని నీటితో వరి నారు పెంచుతున్నారు.

వర్షం కోసం చూస్తున్నాం

జిల్లాలో పెద్ద వర్షం ఇప్పటికి ఒక్కటీ లేదు. చిరుజల్లులకే పరిమితం అయ్యాయి. అదును దాటిపోతుందని బావిలో నీరు ఉండటంతో రెండు ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న విత్తనాలు వేశాను. ఆ విత్తనాలను కాపాడుకునేందుకు ఆకాశం వైపు చూస్తూనే.. డ్రిప్‌ ద్వారా నీటిని అందిస్తున్నాను.

– ఏలేటి స్వామిరెడ్డి, శ్రీరాములపల్లె

జూలైలో వర్షాలు కురిసే అవకాశం

జూన్‌లో అంతంతమాత్రంగానే వర్షపాతం నమోదైంది. జూలైలో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నేలల్లో విత్తనాలు వేసిన రైతులు నీటిని అందించడం మంచిది. వాతావరణంలోని మార్పులతో వర్షాలు కురువడంతో కొంత ఆలస్యం అవుతోంది.

– శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస

చినుకు చిన్నబోయింది..1
1/2

చినుకు చిన్నబోయింది..

చినుకు చిన్నబోయింది..2
2/2

చినుకు చిన్నబోయింది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement