
రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం అందిస్తున్నాం
● రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వర్‌రావు ● జాబితాపూర్‌లో గోదాము నిర్మాణానికి శంకుస్థాపన
జగిత్యాలరూరల్: రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వర్‌రావు అన్నారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో రూ.13.38 కోట్లతో నిర్మించనున్న 20వేల టన్నుల గోదాముల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమని, రైతులకు గోదాముల నిర్మాణం ఎంతో అవసరమని పేర్కొన్నారు. రేషన్‌కార్డుపై పేద, మధ్యతరగతి ప్రజలకు సన్నబియ్యం పంపిణీ దేశంలో ఎక్కడా లేదన్నారు. 5 నుంచి 10 లక్షల టన్నుల గోదాములు నిర్మించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, ఇప్పటివరకు 2.5 లక్షల టన్నుల గోదాములకు ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. గోదాముల నిర్మాణంతో కూలీలకు ఉపాధి, రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. పదేళ్లలో 20 వేల టన్నుల గోదాములు నిర్మిస్తే.. ఈ ఏడాదిలోనే 20 వేల టన్నుల గోదాములు నిర్మించబోతున్నామన్నారు. గోదాంకు వచ్చే బైపాస్‌రోడ్ విస్తరణ చేపడతామన్నారు. లక్ష్మీపూర్‌లో సీడ్ ప్రాసెస్ యూనిట్ నిర్మాణం పూర్తయిందని, కొంత సామగ్రి కొరత ఉందని, దానిని పూర్తి చేయాలని సూచించారు. గిడ్డంగుల డీఈ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, నాయకులు రవీందర్‌రెడ్డి, సదాశివరావు, మహేశ్, సతీశ్, శంకర్, నారాయణగౌడ్, రాజ్‌కుమార్, సత్తిరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, శేఖర్, ప్రవీణ్ పాల్గొన్నారు.