
జగిత్యాల/మెట్‌పల్లి: మహిళా సంఘాల సభ్యులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న వడ్డీ బకాయిలు మంజూ రు కావడంతో సర్వత్రా ఆనందం వ్యక్తమైంది. జిల్లాకు సుమారు రూ.22.70కోట్లు విడుదల కావడంతో ఆర్థిక సమస్యలు పరిష్కారమైనట్లేనని మహిళలు భావించారు. కానీ.. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో తప్ప మిగతా మహిళా సంఘాలన్నింటికీ వడ్డీ సొమ్ము తిరిగి వచ్చింది. కానీ, బల్దియాల్లో చేరిన వాటికి పైసా రాకపోవడంతో నిరసన వ్యక్తమవుతోంది.
ఇవీ విలీన గ్రామాలు
● జగిత్యాల పట్టణ సమీపంలోని ఆరు గ్రామాలు బల్దియాలో విలీనమయ్యాయి.
● కోరుట్లలో ఒకటి, మెట్‌పల్లి మున్సిపాలిటీలో రెండు గ్రామాలు విలీనమయ్యాయి.
● ఈమేరకు 30 మార్చి 2018న ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
● రాయికల్, ధర్మపురి పురపాలికలు కొత్తగా ఆవిర్భవించాయి.
జిల్లాకు రూ.22.70కోట్లు విడుదల
జిల్లాలోని మహిళా సంఘాలు ఇప్పటికే తీసుకున్న రుణాలకు ప్రతినెలా క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూ వస్తున్నాయి. ఈ సొమ్ము ప్రభుత్వం బ్యాంకర్లకు చెల్లించాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈక్రమంలో ఇటీవల రూ.22.70కోట్లను విడుదల చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అందరికీ వచ్చాయి.. కానీ..
● జిల్లాలోని ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలు కొత్తగా ఆవిర్భవించాయి.
● ఈ పురపాలికల్లోని మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలు విడుదలయ్యాయి.
● కానీ, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో కార్యకలాపాలు నిర్వహించే మహిళా సంఘాలకు ఇప్పటివరకూ పైసా వడ్డీ రాలేదు.
● అన్ని మున్సిపాలిటీల్లో వచ్చి, తమప్రాంతాల్లో ఎందుకు రావడంలేదని ఆయా మహిళా సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి.
● సోమవారం కలెక్టరేట్ ఎదుట టీఆర్‌నగర్ గ్రామ మహిళలు ఏకంగా ప్రత్యక్ష నిరసనకు దిగడం గమనార్హం.
2018–19 నుంచి నిలిచిన వడ్డీ..
సుమారు నాలుగేళ్లుగా మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ చెల్లించలేదు. బ్యాంకుల నుంచి రుణా లు తీసుకున్న మహిళలు వడ్డీ సొమ్మును బ్యాంకుల్లో చెల్లిస్తూ వచ్చారు. మధ్యలో 2018లో వడ్డీ సొమ్ము విడుదల చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయింది.
విలీన గ్రామాలకే మొండిచెయ్యి..
● జిల్లాలోని పలు మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలు రూ.22.70 కోట్లు ఇటీవల విడుదలయ్యాయి.
● 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12,213 సంఘాల సభ్యులకు రూ.6.24 కోట్లు, 2019–20 సంవత్సరానికి సంబంధించి 12,463 సంఘాలకు రూ.16.46 కోట్లు విడుదలయ్యాయి.
● ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ బకాయిలు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
● కానీ, మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల మహిళా సంఘాలకు పైసా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
జిల్లా సమాచారం
వివరాలు లేకనే..
మహిళా సంఘాలు తీసుకున్న వడ్డీలేని రుణాలకు సంబంధించి ప్రభుత్వం రూ.22.70కోట్లు మంజూరు చేసింది. ఈ సొమ్ము ఇటీవల విడుదలైంది. కానీ, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల మహిళా సంఘాల డాటా లభించలేదు. అందుకే జాబితాలో ఆ సంఘాల పేర్లు తప్పిపోయాయి. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్య. ఇలాంటి సంఘాలను గుర్తించడంలో నిమగ్నమయ్యాం. అందరికీ వడ్డీ సొమ్ము వస్తుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.
– లక్ష్మీనారాయణ, డీఆర్డీఏ పీడీ
సమన్వయ లోపమేనా..?
అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే బల్దియాల్లో విలీనమైన గ్రామాల మహిళా సంఘాలకు వడ్డీ సొమ్ము రాలేదనే విమర్శలు ఉన్నాయి. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు వివరాలు సమన్వయం చేసుకోవడంలో విఫలం కావడం, మహిళల పేర్లు సంపూర్ణంగా నమోదు చేయకపోవడం, మహిళా సంఘాల పేర్లు లేకుండా నివేదికలు తయారు చేయడంతోనే వడ్డీ సొమ్ము విడుదల కాలేదని సమాచారం. అధికారుల వద్ద ఈ సమాచారం కూడా లేదని, అందుకే ఎవరికి, ఎంతసొమ్ము రావాల్సి ఉందనే విషయం తెలియడం లేదని చెబుతున్నారు. అయితే, విలీన గ్రామాల మహిళా సంఘాలు ప్రత్యక్ష ఆందోళనలకు దిగడంతో డాటా షేరింగ్ కోసం అధికారులు ఆగమేఘాలపై రంగంలోకి దిగారని సమాచారం.

కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న టీఆర్‌నగర్ గ్రామ మహిళా సంఘం సభ్యులు

