
‘ప్రత్యేక’ పిల్లలకు విశిష్ట బోధన
విద్యారణ్యపురి: ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ప్రభుత్వం భరోసా భవిత కేంద్రాలు నిర్వహిస్తోంది. శారీరక, మానసిక వైకల్యం ఉన్న పిల్లలను భవిత కేంద్రాలల్లో చేర్పించి పాఠశాల స్థాయి చిన్నారులకు ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్, రిసోర్స్‌పర్సన్లతో ప్రత్యేకంగా విద్యను బోధించనున్నారు.
మండలానికో కేంద్రం
హనుమకొండ జిల్లాలో ప్రతీ మండలానికి ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్వశిక్షా అభియాన్ కింద ఈసెంటర్లను ఏర్పాటు చేశారు. హనుమకొండ, పరకాలలో శాశ్వత భవనంతో కూడిన భవిత కేంద్రాలున్నాయి. మిగతా మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఓగదిలో నడిపిస్తున్నారు. ప్రతి భవిత సెంటర్‌లో 16మంది చొప్పున ప్రత్యేక అవసరాల పిల్లలకు అవకాశం కల్పిస్తున్నారు. భవిత సెంటర్‌లో ఐఈఆర్‌పీ(బోధకుడు) ఆయా పిల్లలకు ప్రత్యేక పద్ధతుల్లో బొమ్మలు చూపిస్తూ.. వారి వైకల్యాన్ని బట్టి వారికి అర్థమయ్యేలా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌తో విద్యను బోధిస్తుంటారు. ఈభవిత సెంటర్‌కు కూడా రాలేని ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇంటివద్దనే హోమ్ బేస్డ్ విద్యను సైతం అందిస్తున్నారు. ప్రతీ శనివారం ఒక్కో ఐఈఆర్‌పీ కనీసం 8 మంది ప్రత్యేక అవసరాల పిల్లల వద్దకు వెళ్లి వారికి అనుగుణంగా విద్యను నేర్పించాల్సి ఉంటుంది.
ఫిజియోథెరపీ వైద్యం.. రెమ్యునరేషన్
ప్రతీ భవిత సెంటర్‌లో ఫిజియోథెరఫిస్ట్‌ను అందుబాటులో ఉంచుతారు. శారీరకంగా వైకల్యాన్ని బట్టి ఫిజియోథెరపీ చేస్తారు. గతంలో వారానికి ఒక్కరోజే వీరు భవిత సెంటర్‌కు వచ్చి ఫిజియోథెరపీ చేసేవారు. ఈవిద్యా సంవత్సరం నుంచి వారంలో రెండు రోజులు చేయనున్నారు. కాగా భవిత సెంటర్లకు పిల్లల్ని తీసుకొచ్చే తల్లిదండ్రులకు నెలకు రూ 500లు, పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు రూ 500లు చొప్పున రవాణా భత్యం ఇస్తున్నారు. ఈవిద్యాసంవత్సరంలో హనుమకొండ జిల్లాలో 1,841 మంది పిల్లలు ప్రత్యేక అవసరాల పిల్లలున్నట్లుగా సంబంధిత అధికారులు చెబుతున్నారు.
సొంత భవనాలు రెండింటికే
హనుమకొండ మండల కేంద్రంలో, పరకాలలోని భవిత కేంద్రాలకు సొంత భవనాలున్నాయి. వీటిని అందంగా తీర్చిదిద్దారు. ఈరెండు భవిత కేంద్రాలకు ఒక్కొ భవిత కేంద్రానికి రూ. 2 లక్షలు చొప్పున మంజూరయ్యాయి. ఆ నిధులతో పిల్లలను ఆకట్టుకునే బొమ్మలు, మెటీరియల్ కొని ఉంచారు.
మరో రెండింటికి రూ.7 లక్షలు
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి ప్రాథమిక పాఠశాలలో భవిత కేంద్రాన్ని నడుపుతున్నారు. అక్కడ స్థలం ఉండడంతో భవిత కేంద్రం నిర్వహించేందుకు ఒక గదిని నిర్మించేందుకు కొన్ని నెలల క్రితం రూ.7 లక్షలు మంజూరయ్యాయి. హసన్‌పర్తి మండలం భీమారంలోని ప్రాథమిక పాఠశాలలో భవిత కేంద్రాన్ని నడుపుతున్నారు. అక్కడ సైతం గది నిర్మాణానికి రూ.7 లక్షలు మంజూరయ్యాయి. వీటిని త్వరలోనే నిర్మించనున్నారు. కాగా.. మిగతా చోట్ల మరమ్మతులకు టాయ్‌లెట్స్ ర్యాంపులకు ఒక్కో భవిత కేంద్రానికి రూ.లక్ష జిల్లాలో ఐనవోలు, కమలాపూర్, మడికొండ, కంఠాత్మకూరు, పత్తిపాక, వేలేరు, అక్కంపేట, భీమదేవరపల్లి, దామెర స్కూళ్లలో నడుపుతున్న భవిత సెంటర్ల మరమ్మతులకు రూ.లక్ష చొప్పున నిధులు మంజూరు చేశారు. అంతేకాకుండా జిల్లాలోని 14 భవిత కేంద్రాలకు పేయింటిం కోసం ఒక్కో భవిత కేంద్రానికి రూ ఒక లక్ష 50 వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తం రూ.63.25 లక్షల నిధులు మంజూరయ్యాయి.
ప్రత్యేక పిల్లలకు‘ భవిత’ తోడ్పాటు
గ్రామాల్లోని ప్రత్యేక అవసరాల పిల్లల్ని సిబ్బంది గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించనున్నారు. పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఫిజియోథెరపీ, ప్రత్యేకంగా బోధన ఉంటుంది. భవిత కేంద్రాలను ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులు వినియోగించుకోవాలి.
– బద్దం సుదర్శన్ రెడ్డి,
జిల్లా కమ్యునిటీ మొబిలింగ్ కోఆర్డినేటర్
జిల్లాలో భరోసా భవిత కేంద్రాలు
రెండింటికి ప్రత్యేక నిధులు,
శాశ్వత భవనాలు
వైకల్యం ఆధారంగా విద్యా బోధన
వారానికి రెండు సార్లు ఫిజియోథెరపీ
జిల్లాలో 1841 మంది ప్రత్యేక
అవసరాలున్న పిల్లలు

‘ప్రత్యేక’ పిల్లలకు విశిష్ట బోధన

‘ప్రత్యేక’ పిల్లలకు విశిష్ట బోధన