
ఊరి మధ్యలో.. ఊడల మర్రి
శాయంపేట : ఇంతింతై..వటుడింతై అన్నట్లు.. మర్రి మొక్క, ఊడలతో మహా వృక్షంగా మారింది. ఊరి మధ్యలో నాటిన మర్రి మొక్క.. నేడు ఊడలతో ఎందరికో నీడనిస్తోంది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి సెంటర్‌లో ఊడల మర్రి, రాళ్లచెట్టు 30ఏళ్లుగా గ్రామస్తులకు నీడను అందిస్తున్నాయి. జోగంపల్లి నుంచి వేరే గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఎండ, వానకు నీడనిచ్చి కాపాడుతోంది. అంతేకాకుండా గ్రామంలోని వృద్ధులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మర్రిచెట్టు నీడన కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. 35ఏళ్ల క్రితం కూచన మొగిలి అనే వ్యక్తి.. ఊడల మర్రి, రాళ్ల చెట్లను నాటడంతో అవి పెరిగి మహా వృక్షాలై వాటి నీడన సేదదీరుతున్నామని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మర్రిచెట్టు నీడను రచ్చబండగా మార్చేశారు. ఈ చెట్టు నీడన సైకిల్ షాపు, పచార్ కొట్టు, సెలూన్ షాపులను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు.
మర్రి నీడన కాలక్షేపం చేస్తా..
35ఏళ్ల క్రితం గ్రామంలో ఒకరు చనిపోగా కట్టెల కోసం వెళ్లా. కట్టెల మొదలల్లో మర్రి, రాళ్ల చెట్ల మొలక ఉండడాన్ని గమనించి వాటిని గ్రామంలోని సెంటర్‌లో ఉన్న ఖాళీ స్థలంలో నాటిన. అవి నేడు ఊడల మర్రిగా.. మహా వృక్షంగా మారడాన్ని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. నేను రోజు మర్రి నీడన కాలక్షేపం చేస్తాను. ప్రతీ ఒక్కరు తమ ఇళ్లలో తల్లిదండ్రుల పేరుతో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
– కూచన మొగిలి, గ్రామస్తుడు