
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు పెంచాలి
● హనుమకొండ డీఈఓ వాసంతి
విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ లో ఈవిద్యాసంవత్సరం (2025–2026)లో ప్రవేశాలు పెంపుదల చేయాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. గురువారం హనుమకొండలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లతో డీఈఓ కార్యాయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్‌కు అర్హులలైన మహిళా సమాఖ్య సభ్యులు 1,800మందికిపైగా జిల్లాలో ఉన్నారని, వారు ప్రవేశాలు పొందేలా కృషి చేయాలని సూచించారు. వారికి ఓపెన్ స్కూల్ విద్య గురించి తెలియజేసి చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. అడ్మిషన్ల విధానం, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అనేది కూడా వివరించాలన్నారు. ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాల లక్ష్యాలను వివరించారు. మళ్లీ ఈనెల 9న సమీక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం పాల్గొన్నారు.
నేడు శ్రీరుద్రేశ్వరస్వామికి శతఘటాభిషేకం
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం ఉదయం శ్రీరుద్రేశ్వరస్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ధరణికోట అనిల్‌కుమార్, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు కురవాలని, పాడిపంటల సమృద్ధి, భూగర్భజలాలు నిండుగా ఉండాలనే సంకల్పంతో రుష్యశృంగపూజ 60 వారుణానువాకాలుతో శ్రీరుద్రేశ్వరుడికి శతఘటాభిషేకం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ ఉంటుందని తెలిపారు.
మహాశాకంబరీ ఉత్సవ
ఏర్పాట్లపై సమీక్ష
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 10న గురువారం ఆషాఢ శుద్ధ పౌర్ణమిరోజున మహాశాకంబరీగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా గురువారం కార్యాలయంలో ఈఓ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ధర్మకర్తలు, మట్వాడ సీఐ గోపి, ట్రాఫిక్ ఎస్సై సాయికిరణ్ పాల్గొని దేవాలయాన్ని పరిశీలించి శాకంబరీ ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు క్యూ లైన్లు, తాగునీటి వసతి, బాదంమిల్క్, మజ్జిగ పంపిణి, అదనంగా ప్రసాదాల విక్రయకౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పాలిటెక్నిక్ కాలేజి పక్కగా ప్రవేశించి దర్శనం అనంతరం కాపువాడ మీదుగా బయటకు వెళ్లాలని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా ఈఓ శేషుభారతి దేవాలయంలో పూలమొక్కలు నాటారు.
నేడు దొడ్డి కొమురయ్య వర్ధంతి
కాజీపేట అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరుకావాలని కోరారు.
రోగనిర్ధారణ పరీక్షల
లక్ష్యాన్ని అధిగమించాలి
న్యూశాయంపేట: రోగ నిర్ధారణ పరీక్షల లక్ష్యాన్ని అధిగమించాలని భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అరుంధతి పట్నాయక్ అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్‌పై గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 8 రకాల వ్యాధులకు సంబంధించి 2,04,979 మంది రోగులు ఉన్నారని తెలిపారు. వారిలో 3,794 మందికి జూన్ 3 నుంచి రెండో విడత టీబీ, 8 రకాల వ్యాధుల నిర్మూలనకు వైద్య, ఆరోగ్య శాఖ కృషిచేస్తోందని తెలిపారు. టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు.

ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు పెంచాలి