
జాతర ఇలా..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది. ప్రతీ రెండేళ్లకోసారి సాగే మహాజాతర తేదీలను పూజారులు ఎక్కువగా ఫిబ్రవరి నెలలోనే ఖరారు చేస్తారు. ఈసారి అధిక అమావాస్య రావడంతో వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పూజారులు బుధవారం మహాజాతర తేదీలను ప్రకటించారు.
20 రోజుల ముందుగానే జాతర
ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన మేడారం మహాజాతర ఈసారి 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. దీంతో 20 రోజుల ముందుగానే మహాజాతర జరగనుంది. పూజారులు పంచాంగం, కొత్త క్యాలెండర్ ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి, అమ్మవార్ల ఘడియలను బట్టి జాతర తేదీలను ఖరారు చేస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి జాతర తేదీలను అమావాస్య రోజుల్లో పౌర్ణమికి ముందుగా నిర్ణయించడం ఆనవాయితీ. ఈసారి 2026 జనవరి 17 నుంచి అమావాస్య మాసం ప్రారంభం కావడం, జనవరి 31న పౌర్ణమి అవుతుండడంతో మాఘశుద్ధ పౌర్ణమికి ముందుగా జాతర తేదీలను నిర్ణయించారు. అంటే అధిక అమావాస్య రావడంతో ఈసారి జనవరిలోనే నిర్ణయించినట్లు పూజారులు వెల్లడించారు.
2018లో జనవరిలోనే జాతర..
గత మహాజాతరల తేదీలను పరిశీలిస్తే.. 2018లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతర జరిగింది. అలాగే 2010లో ఫిబ్రవరి 17నుంచి 20 వరకు, 2012లో ఫిబ్రవరి 8 నుంచి 11వరకు, 2014లో ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు, 2016లో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు, 2020లో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు, 2022లో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు, 2024లో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహాజాతర సాగింది. 2018లో మాత్రం జనవరి 31 నుంచి జాతర సాగగా.. ఈ దఫా 2026 జనవరి నెలాఖరులోనే జాతర సాగనుంది.
అధికార యంత్రాంగం సమాయత్తం
మేడారం మహాజాతర తేదీలను పూజారులు ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై సమాయత్తం కానుంది. ఈసారి ముందస్తుగానే శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో ఇప్పటికే మేడారంలో శాశ్వత నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఇకనుంచి జిల్లా యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై ప్రణాళికలతో ముందుకెళ్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కోరారు.
2026 జనవరి 28 నుంచి
31 వరకు..
కొనసాగుతున్న
శాశ్వత అభివృద్ధి పనులు
జనవరి 28వ తేదీ:
సారలమ్మ, పగిడిద్దరాజు,
గోవిందరాజులు గద్దెలపైకి రాక
29వ తేదీ : సమ్మక్క గద్దైపెకి
30వ తేదీ: భక్తులు మొక్కుల చెల్లింపు
31వ తేదీ: దేవతల వనప్రవేశం

జాతర ఇలా..

జాతర ఇలా..