
బాభౌయ్.. ర్యాభౌస్..!
గుంటూరు మెడికల్: కుక్కకాటుతో ర్యాబీస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి 2011లో రాష్ట్రాన్ని వణికించింది. ప్రతి ఏడాది ర్యాబీస్‌తో జిల్లాలో పది నుంచి 15 మంది మరణిస్తున్నారు. మున్సిపాలిటీలలో కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవటం లేదని, కుక్కలు రోజూ గాయపరస్తున్నాయని గుంటూరు కార్పోరేషన్‌తోపాటుగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. జిల్లాలో ప్రతి ఏడాది వేలల్లో కుక్కకాటు కేసులు నమోదు అవుతున్నాయి. గుంటూరు జీజీహెచ్‌లో 2023లో 34,931 మంది, 2024లో 37,202, 2025 జూన్ వరకు 13,002 కుక్కకాటు ఇంజక్షన్లు చేయించుకున్నారు.
వ్యాధి లక్షణాలు ఇవీ...
ప్రతి కుక్కలోనూ ర్యాబీస్ వైరస్ ఉండదు. కానీ అది ఉన్న కుక్క ఏదో తెలియదు. కాబట్టి ప్రతి కుక్కకాటును సీరియస్‌గానే పరిగణించాలి. పిచ్చికుక్క కరిచిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ర్యాబీస్ వ్యాధి సోకిన కుక్క నాలుక బయటకు చాపి, చొంగ కారుస్తూ మతి స్థిమితం లేకుండా తిరుగుతుంది. తన యజమానిని గుర్తించలేక పోవటం, కన్పించిన ప్రతి వస్తువును కరిచేందుకు ప్రయత్నిస్తుంది. నడిచేటప్పుడు తడబడుతూ, తూలుతూ తోకను ఆడించలేని స్థితిలో ఉంటుంది. అరుపులో మార్పు వస్తుంది. నీటిని కూడా తాగలేని స్థితిలో అంటు డొక్కలు పడి ఊపిరి పీల్చుకోలేక ఐదు నుంచి ఏడు రోజుల్లో మరణిస్తుంది. మనుషులు ర్యాబీస్ వ్యాధికి గురైనప్పుడు దవడ, గొంతు కండరాలకు పక్షవాతం వచ్చి ఎంత దాహం వేసినా నీటిని తాగలేరు. ఎక్కువ సందర్భాలలో రోగి నీటిని చూసినా ,నీటి శబ్దం విన్నా భయకంపితులవుతారు. ఈ లక్షణాన్ని హైడ్రో ఫోబియా అని పిలుస్తారు. ఇలాంటి స్థితిలో మతిస్థిమితం కోల్పోయి, ఊపిరి పీల్చుకోలేక మనుషులు కూడా మరణిస్తారు.
కుక్కకాటుతో ర్యాబిస్ వ్యాధి ప్రతి ఏడాది జిల్లాలో 15కుపైగా మరణాలు వ్యాక్సిన్‌తో కచ్చితమైన రక్షణ నేడు ప్రపంచ జూనోసిస్ డే
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను ‘జూనోసిస్’ వ్యాధులు అంటారు. పశువులు, కుక్కలు, గుర్రాలు, పందులు, పిల్లులు, పక్షులు, ఎలుకలు తదితర పశుజాతుల నుంచి సుమారు 280 రకాల వ్యాధులు మనుషులకు సంక్రమిస్తాయి. వీటిల్లో క్షయ, మెదడువాపు, బ్రూసెల్లోసిస్, ఆంత్రాక్స్, ర్యాబిస్ ముఖ్యమైనవి. లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త 6 జూలై 1885లో పిచ్చికుక్కకాటుకు గురైన బాలుడికి ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకా వేసి రక్షించారు. నాటి నుంచి జూలై 6ను ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

బాభౌయ్.. ర్యాభౌస్..!