
ఇది బీసీల కాలం. ఇది బీసీ శతాబ్దం. ఇది బీసీ చైతన్యం వెల్లివిరుస్తున్న కాలం. దేశానికి స్వాతంత్య్రం వస్తే బహుజనులకు ఏమిస్తారో చెప్పండని 150 ఏళ్ళ క్రితమే మహాత్మా జ్యోతిబా ఫూలే వేసిన ప్రశ్నకు నేటికీ భారత పాలకులు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. దేశమంతా బీసీ చైతన్యం రాజుకుంటోంది. బీసీలు నిప్పుల కుంపట్లయి భగ్గుమంటున్నారు. దేశమంతా బీసీ కులగణన చేయాలని బీసీ సంఘాలు, సామాజిక ఉద్యమకారులు కోరు తున్నారు. అనేక రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీ లలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాయి. రామస్వామి పెరియార్ తమిళనాడులో జరిపిన అలుపెరుగని పోరాటాలకు గుర్తుగా బీసీలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లలో 69 శాతం రిజర్వేషన్లు ఆ రాష్ట్రంల్లో అమలు లోకి వచ్చాయి. జనతా పార్టీ ‘బీపీ మండల్’ కమిషన్ వేస్తే జనతాదళ్ పాలనలో ప్రధాని వీపీ సింగ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ తీర్మానించారు. మండల్ కమిషన్ అమలులో జరిగిన ఘర్షణల అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే పీవీ నరసింహా రావు ప్రభుత్వం మండల్ సిఫారసులను అమలు చేసింది.
తమ జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రిజర్వేషన్లు పొంది చట్టసభల్లోకి అడుగు పెట్ గలిగినప్పుడే బీసీలకు సంపూర్ణ న్యాయం వచ్చినట్లు, స్వాతంత్య్రం లభించినట్లు అవు తుంది. బీసీ సామాజిక వర్గాలు సుదీర్ఘకాలం చేసిన పోరాటాలకు ఫలితం దక్కినట్లవుతుంది. ఇది జరగడానికి బీసీ కుల గణన చేయటం తొలిమెట్టు అవుతుంది. ఆ పనికి ఇంతకాలానికి కేంద్ర ప్రభుత్వంముందుకు వచ్చినందుకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, అన్ని బీసీ సామాజిక వర్గాలు ముక్తకంఠంతో అభినందిస్తున్నాయి. హర్షం వ్యక్తం చేస్తున్నాయి.దేశంలో రావాల్సిన విప్లవం ఏదైనా ఉంటే అది బీసీ విప్లవమే! పాలకులు చాలావరకు ఏదో ఒక రకంగా బీసీ చైతన్యాన్ని అణచి వేసినవాళ్ళే. బీసీలకు పాలించే లక్షణాలు లేవనీ, వారిని ఏవో కొన్నిసంక్షేమ పథకాలను అనుభవించడానికే పరిమితం చేశారు. ఈ పెత్తందార్లు ఇప్పటికీ బీసీలు ఐక్యం కారని గట్టిగా నమ్ముతున్నారు. బీసీ ఐక్యతపై వీలు చిక్కినప్పుడల్లా దాడి చేస్తూ విభజించడానికే ప్రయత్ని స్తున్నారు. అయితే ఇపుడిపుడే అన్ని పార్టీలూ గొంతులు సవరించుకుని బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని అంటున్నాయి. దీనికి సమాంతరంగా బీసీల చైతన్యం పెరిగింది. బీసీ భావజాల ప్రచారాలు విస్తృతంగా జరుగుతున్నాయి. బాబా సాహెబ్ అంబేడ్కర్ అన్నట్లుగా అన్నింటికీ రాజ్యాధికారమే అసలు ‘కీ’. దాన్ని పొందాలంటే తొలుత బీసీ కులగణన జరగాలి. ఈ దిశలో కేంద్రం ఒక అడుగుముందుకు వేసింది. ఇందుకు సానుకూలంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నా...బీసీ కులగణన జరిపి చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు పొందేంత వరకు పదును తగ్గని బీసీ ఉద్యమాలను కొనసాగించవలసే ఉంటుంది. అప్పటిదాకా దేశానికి బీసీ జ్వరం పట్టవలసిందే. బీసీల జనాభా ఎంతో లెక్కప్రకారం తేల్చేదాకా విశ్రమించకుండా ఉండాలి. బీసీలు చట్టసభల్లో, విద్య, ఉద్యోగాల్లో తమ వాటా తాము పొందేంతవరకు నిరంతర చైతన్యంతో ముందుకు సాగాలి. బీసీలు, ఇందులో బాగా వెనుకబడిన ఎంబీ సీలు, సంచార, విముక్త జాతులందరికీ జనాభా దామాషా పద్ధతిలో సమ వాటా పొందినప్పుడే బీసీలకు నిజమైన స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. ఆ స్ఫూర్తితోనేబీసీల అవగాహన, ఉద్యమాలు ఎగిసి పడాలి. బీసీ విద్యావంతులు, ఉపాధ్యా యులు, ప్రొఫెసర్లు విస్తృతంగా బీసీలలో అవగాహన కల్పించే పనికి మరింత ముమ్మర కృషి చేయాలి.
ప్రధానంగా బీసీ యువత ఈ బాధ్య తను భుజం మీద వేసుకోవాలి. నెత్తుటిచుక్క చిందించకుండా బీసీల సంపూర్ణ హక్కుల సాధన దిశగా బీసీ యువత కదలాలి. బీసీల సంపూర్ణ స్వాతంత్య్రం సాధించే ఉద్యమాలలో బీసీ యువత కీలక పాత్రధారి కావాలి. పలు పార్టీలుగా చీలి పోయిన బీసీలంతా ఒక్కతాటిపైకి వచ్చి నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. బీసీల కులగణన జరిపి, స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంటుల్లో వారి వాటా వారు పొందేంత వరకు విశ్రమించ కూడదు. బీసీ కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావుల ఐక్యత వర్ధిల్లేవిధంగా ఉద్యమాలు జరగాలి. ‘బీసీలం ఇక ఎంతమాత్రం పాలితులం కాదు పాలకులమ’ని నిరూపించేదాకా విశ్రమించ కూడదు. ‘చట్టసభల్లోసమ ప్రాధాన్యం’ అన్న ఏకవాక్య నినాదమే ప్రతి బీసీ స్వప్నం, లక్ష్యం కావాలి.
వ్యాసకర్త తెలంగాణ తొలి బీసీ కమిషన్ సభ్యులు