తిరుగులేని తీర్పు

Sakshi Guest Column On Supreme Court of India judgment

సందర్భం

ఎన్నికల కమిషన్‌(ఈసీ) ఎంపిక ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు మరింతగా స్వతంత్ర ఎన్నికల కమిషన్‌ కి హామీనిస్తుంది. ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన స్వతంత్ర ఎంపిక కమిటీ ఏర్పాటు వల్ల ఈసీ ప్రస్తుత ఎంపిక పద్ధతిని సరిచేయడమే కాకుండా ఎంపిక ప్రక్రియకు పవిత్రతను జోడిస్తుంది.

దీనిని ఇప్పుడు మనం తప్పుపట్టలేని విధంగా ప్రకటిద్దాం: దాదాపు ప్రతి రాజకీయ సమస్య కూడా న్యాయస్థానం పరిధిలోకి వస్తున్న సమయంలో దేశంలో రాజకీయ అధికారానికి సంబంధించి అత్యంత శక్తిమంతమైన కేంద్రంగా భారత సర్వోన్నత న్యాయస్థానం కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్‌ ప్రధాన అధికారి, ఇతర కమిషనర్ల ఎంపిక కోసం తటస్థ విభాగం ఏర్పాటు అనేది అనూప్‌ బరన్వాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో వచ్చిన ప్రధాన ఉపశమనం. న్యాయవ్యవస్థ క్రియాశీలతా యుగాన్ని ఈ తీర్పు పునరుద్ధరించింది. గతంలో జరిగిన విధంగా కేంద్ర ప్రభుత్వంలో బలహీన సంకీర్ణంలోని తప్పులకు వ్యతిరేకంగా కాకుండా, బలవంతుడైన కార్యనిర్వాహకుడికి వ్యతిరేకంగా ఈసారి సుప్రీంకోర్టు వ్యవహరించింది. 

పిటిషనర్ల వాదంలోని ప్రధానాంశం ఏమిటంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324(2) ప్రకారం సీఈసీ (ప్రధాన ఎన్నికల కమిషనర్‌), ఈసీ (ఎన్నికల కమిషనర్‌)ల ఎంపిక రాష్ట్రపతి ద్వారా జరుగుతున్నప్పటికీ, దానికి నిర్దిష్టంగా ప్రకటించిన చట్టం ప్రాతిపదికగా ఉండాలన్నదే. అయినప్పటికీ దీనికి సంబంధించి పార్లమెంటులో ఎలాంటి చట్టాన్నీ తీసుకురాలేదు.

ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని, సీఈసీ, ఈసీల ఎంపిక విషయంలో కేంద్రం మినహాయింపు పొందుతోంది. అధికారంలో ఉన్నవారికి, తమను ఎంపిక చేసుకున్న వారి అభిమతానికి అనుకూలంగా వ్యవహరించడం సీఈసీకి, ఈసీ సభ్యులకు పరిపాటిగా మారింది. అందువల్లే ప్యానెల్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని హామీ ఇచ్చేందుకు సీఈసీ, ఈసీల నియామకం విషయంలో స్వతంత్ర సంస్థను ఏర్పర్చాలని పిటిషనర్లు ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

రాజ్యాంగ నియమంతో మరొక సమస్య కూడా ఉంది. ఆర్టికల్‌ 324(5) నియమం ప్రకారం, సీఈసీ తొలగింపునకు వ్యతిరేకంగా ప్రత్యేక రక్షణ కూడా ఉంటుంది. ఇతర ఈసీ సభ్యు లకు ఇలాంటి రక్షణను కల్పించలేదు. సుప్రీంకోర్టు న్యాయ మూర్తిని తొలగించే పద్ధతిలో మినహా, ఎన్నికల ప్రధాన కమిష నర్‌ తొలగించకూడదని ఈ నియమం పేర్కొంది. వాస్తవంగా దీని అర్థం ఏమిటంటే సీఈసీని పార్లమెంట్‌ అభిశంసించే మార్గం ద్వారా మాత్రమే తొలగించవచ్చు. ఇది కష్టమే కావచ్చు కానీ అసాధ్యమని చెప్పలేము.

సీఈసీ నియామకం తర్వాత ఆయన సర్వీస్‌ నియమాలు తనకు అననుకూలతను తీసుకురాకూడదని ఈ నియమమే చెబుతోంది. పక్షపాతం లేదా, ఆశ్రిత పక్షపాతం ద్వారా సీఈసీ ఎంపికలో ఉల్లంఘన జరిగినప్పుడు సీఈసీకి మంజూరు చేసిన ఈ రక్షణ ఛత్రాన్ని నష్టపోవలసి ఉంటుంది. పైగా, సీఈసీ పదవీకాలంలో ఉండగా రక్షణ లేదా భద్రతను కోరుతున్నట్లయితే, సీఈసీపై ఇతర ఈసీ సభ్యులు మరింతగా అనుమానించవచ్చు. ఈ భయాందోళనలనే పిటిషనర్లు సుప్రీంకోర్టు ముందు వెలిబుచ్చారు.

సీఈసీని ఎంపిక చేయడానికి ప్రధాన మంత్రి, లోక్‌సభలో అతిపెద్దపార్టీకి చెందిన ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పర్చడం అంటే నిలకడైన ప్రజాస్వామ్యం వైపు పెద్ద ముందంజగా భావించాలి. ఆర్టికల్‌ 342లోని ఖాళీ అనేది ప్రజాస్వామిక వాతావరణానికి చాలా అవసరం. అందుకే దానిపై ఎలాంటి ఉత్తరువు, సూచన ద్వారా ఆ ఖాళీని ఆక్రమించాలని రాజ్యాంగ సభ భావించలేదు. ఆ ఖాళీని భవిష్యత్‌ పార్లమెంటుకే వదిలేశారు. ప్రజాస్వామిక చట్టబద్ధతకి చెందిన గొప్ప లక్షణంతో ఈ సమస్యను ఎన్నికయ్యే పార్లమెంట్‌ చట్టబద్ధం చేస్తుందని భావించారు.

అది రాజ్యాంగ ఆకాంక్షగానే తప్ప ఖాళీగా ఎప్పుడూ ఉండలేదు. ఏమైనప్పటికీ దాన్ని ఎవరూ పూరించలేదు. ఫలితంగా, సీఈసీలను ఈసీలను ఎంపిక చేసి నియమించే అధికారాన్ని కార్యనిర్వాహక వర్గమే ఆస్వాదిస్తూ వచ్చింది. దీనివల్ల ఏర్పడిన ముఖ్యమైన భయాల్లో ఒకటి... పాలకపార్టీకి అనుకూలంగా కమిషన్‌ని పాక్షిక పునాదులపై నిర్వహించడమే. రాజ్యాంగ మౌనం ప్రయోజనకరమైనది, భావ నాత్మకమైనది, ప్రజాస్వామికమైనదిగా ఉండేది. అదే పార్లమెంటు విషయానికి వస్తే మార్మికంగా, దుస్సాహసికంగా, అప్రజాస్వామికంగా ఉండేది. అయితే మార్చి 2న వెలువరించిన తీర్పు ద్వారా ఉన్నత న్యాయస్థానం దీన్ని సరిచేసింది.

సీఈసీ, ఈసీ క్రియాత్మక స్వయంప్రతిపత్తి వారు ఎంపికైన ప్రక్రియతో ప్రత్యక్ష అనుసంధానం కలిగి ఉంటుంది. ఎన్నికల రూపంలోని నిరంకుశత్వంలో అనేక విధాలుగా పోల్‌ ప్యానెల్‌పై కార్యనిర్వాహకవర్గానిదే పైచేయిగా ఉంటుంది. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా దాడికి గురయ్యే స్థితిలోని ఎన్నికల కమిషన్‌ ఒక కృత్రిమ పరిస్థితిలో కూరుకుపోయి, దాని సమర్థమైన పనితీరు నుంచి పక్కకు వెళుతుంది.

సుప్రీంకోర్టు తీర్పు, ఎంపిక ప్రక్రి యలో న్యాయబద్ధతకు హామీనివ్వడమే కాకుండా, భారత్‌ కల్లోల కాలాల్లో రాజ్యాంగ పాఠంగా వ్యవహరిస్తుంది. దేశంలో ఎన్నికల ప్రక్రియను ఘోరంగా దుర్వినియోగపరుస్తున్నట్లు తీర్పు గుర్తించింది. ఈసీ ఎంపిక ప్రక్రియపై సుప్రీంకోర్టు తాజా తీర్పు సాంప్రదాయిక ప్రజాస్వామ్యానికీ, రాజ్యాంగబద్ధ ప్రజాస్వా మ్యానికీ మధ్య ఉన్న చక్కటి వ్యత్యాసాన్ని గుర్తిస్తోంది. మొదటి రకం ప్రజాస్వామ్యంలో మెజారిటీకి మాత్రమే విలువ ఉంటుంది.

రెండో రకం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. ఈ తీర్పు ద్వారా చాలాకాలం తర్వాత క్రియాశీల న్యాయ వ్యవస్థను దేశం చూసింది. న్యాయవ్యవస్థ క్రియాశీలత పునరుద్ధ రణ న్యాయపరమైన హేతువుకు కట్టుబడటమే కాకుండా, పూర్వ ప్రమాణాల మద్దతును కూడా కలిగి ఉంటుంది. గొప్పగా కన బడుతున్న కార్యనిర్వాహకవర్గంతో మెజారిటీతత్వపు అంధకార దశ సాగుతున్న కాలంలో ఈ తీర్పు వెలుగులోకి వచ్చింది. ఇది ఈ తీర్పుకు ఒక అంతర్గత విలువను జోడించింది. న్యాయవ్యవస్థ అతి చర్యపై ఆరోపణలు అనేవి మాంటెస్క్యూర్‌(ఫ్రెంచ్‌ తత్వ వేత్త) ప్రతిపాదించిన అధికారాల విభజన సూత్రాలపై ఆధార పడిన కేంద్రప్రభుత్వ సాంప్రదాయిక వైఖరినే ప్రతిబింబిస్తున్నాయి. స్టీవెన్‌ లెవిట్‌స్కీ, డేనియల్‌ జిబ్లాట్‌ రాసిన ‘హౌ డెమోక్రసీస్‌ డై’లోనూ, ఫిలిప్‌ కోగన్‌ రాసిన ‘ద లాస్ట్‌ ఓట్‌’లోనూ వివరించినట్లుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక వ్యవస్థలు అనేక కారణాల వల్ల ప్రమాదంలో పడుతున్నాయి. 

మన ఎన్నికల ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకూ సుప్రీంకోర్టు తీర్పు ఒక మందుబిళ్లలాగా పనిచేసి నయం చేస్తుందని మనం పొంగిపోవద్దు. కానీ కమిషన్‌ ఎంపికకు సంబంధించి తిరుగులేని విధానాన్ని సవరించడం ద్వారా న్యాయస్థానం ఈ ప్రక్రియకు పవిత్రతను ఆపాదించింది.

కాళీశ్వరం రాజ్‌ 
వ్యాసకర్త పిటిషనర్లకు మద్దతుగా ఈ కేసులో సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాది 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top