చైనా బ్యాచ్‌.. కన్యాశుల్కం 

Sakshi Guest Column On China Kanyasulkam

సారాంశం

ఇది సీరియస్‌ విషయమో... సరదా అంశమో చివరిలో మాట్లాడుకుందాం. ముందుగా సరదాగా మొదలుపెడదాం. నిజానికి చైనా బ్యాచ్‌లర్స్‌ గురించి మాట్లాడుకోవాలి.. ఇండియాలోని బ్యాచ్‌లర్‌  తన యాంగిల్‌లో చెబుతున్న ‘భోజరాజు కథ’ ముందుగా విందాం. ఇందులో కాస్త కడుపుమంట కనిపిస్తుంది.

భోజరాజీయం కథ ఇదీ..
ఓ పేద బ్రాహ్మణుడు. చదువు సంధ్యాలేదు. ఇల్లూవాకిలీ లేవు. ఏమీ లేని వారికి పిల్లనెవరిస్తారు. అందుకే సత్రాల్లో కాలక్షేపం చేస్తూ, ఊరూరూ తిరుగుతూ కాశీ చేరాడు. అక్కడే కాలక్షేపం చేస్తున్నాడు. ఇప్పుడు మోదీ పీఎం అయ్యాక బాగా డెవలప్‌ చేసినట్టున్నారు కానీ, అప్పుడంత సీన్‌ లేనట్లుంది. భోజనానికి ఢోకాలేకుండా కొంతకాలం నడుస్తోంది. విభూది పూసుకుని శివావతారంలో దేశ సంచారం చేసే బృందమొకటి కనిపించింది. వారితోపాటు కలిసి తిరుగుతూ, వారు ప్రయాగ యాత్రకు వెళుతుంటే వారితో పాటు ప్రయాగకు చేరాడు. ఏమీ పాలుపోక, చేసేదేమీ లేక అక్కడ పుష్కరిణి నది వద్ద కూచున్నాడు. ఇంతలో అక్కడికి నలుగురు అమ్మాయిలు వచ్చారు. చాలా అందగత్తెలు. నలుగురు మాట్లాడుకుంటూ నదిలోకి దూకారు.  ఇదంతా మనవాడు గమనిస్తున్నాడు.

ఒకమ్మాయి.. నాకు నవ మన్మథాకారుడు, చక్రవర్తి భర్తగా కావాలి..అని చెప్పుకుంటూ దూకింది.
మరొకామె.. నాకు కండల వీరుడు కావాలి.. అన్నది.
ఇంకొకామె.. నాకు కవీశ్వరుడు భర్తగా రావాలి అని కోరుకున్నది.
చివరి అమ్మాయి.. వచ్చే జన్మలో నాకు సంగీత లలిత కళా వల్లభుడు భర్తగా కావాలి అనుకుంటూ దూకేసింది. ‘ఈ జన్మలో ఇలాంటివి సాధ్యం కాదు..వచ్చే జన్మలోనైనా సాధ్యపడేలా చెయ్యి దేవుడా..’ అంటూ ప్రార్థిస్తూ, ఇలా అయితే వచ్చే జన్మలో తప్పక సిద్ధిస్తుంది అనుకుంటూ 
ఆనందంగా దూకేశారు. 

ఇదంతా వింటున్న మన హీరో బుర్ర పాదరసంలా పని చేసింది. వచ్చే జన్మలో ఆ నలుగురు నాకు భార్యలు కావాలి అంటూ తానూ  దూకేశాడు. ఆ తర్వాత జన్మలో  మనవాడు  భోజరాజుగా జన్మించాడు. వా­రం­దరూ అన్ని లక్షణాలు, ఐశ్వర్యం, రాజ్యం ఉన్న భోజరాజుకు భార్యలయ్యారు ఇదీ కథ.

కడుపు మంట ఇదీ..
‘...ఇప్పుడు యూత్‌ అంతా భోజరాజులయితే కానీ పెళ్లి అయ్యేట్లు లేదు. కనీసం ఆ కాలంలో ఒక్కొక్క వరుడిలో ఒక్కో క్వాలిటీ అడిగారు. కానీ, ఈ తరం అమ్మాయిలు అన్ని లక్షణాలూ ఒక్కడిలోనే ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. అందగాళ్లు, ఎన్‌ఆర్‌ఐ సంబంధాలు, హై ఎడ్యుకేషన్లు, లక్షల్లో ప్యాకేజీలు, కార్లు, ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్లు.. ఒక్కటేమిటి అన్నీ..’ 

‘..ఇప్పుడు నాకు 33 సంవత్సరాలు వచ్చాయి.. ఎన్నో సంబంధాలు పోయాయి.. నెత్తి మీద అరెకరం మిగిలింది.. క్యాంపస్‌ సెలెక్షన్లు, సంపన్న సంబంధాలు పోను  మా లాంటి థర్టీ ప్లస్‌ గాళ్లం ‘లెఫ్ట్‌ ఓవర్‌’లాగా మిగిలిపోయాం,.  ఏ మ్యాట్రిమోనీకి పోయినా.. ఎంత ఏజీ, ఎంత ప్యాకేజీ, వెనుక ఎంత బ్యాగేజీ అని అడుగుతున్నారు. ఇక  ఈ జీవితానికి ఇంతే..’ – సోషల్‌ మీడియాలో ఓ బ్యాచ్‌లర్‌ సోదరుడి బాధ.

మరి చైనా కథేంటీ అంటారా... ఇండియాలోని పెళ్లికాని ప్రసాదులకే  ఇన్ని బాధలుంటే మనకు మించిన జనాభా ఉన్న.. చైనాలో బ్యాచ్‌లర్స్‌ బాధ ఇంత కన్నా ఎక్కువ. అక్కడో వరుడు  అచ్చంగా  కోటి రూపాయలకు పైగా వధువుకు ‘కన్యాశుల్కం’ సమర్పించుకున్నాడు. కన్యాశుల్కం అంటే తెల్సుగా.. మన దగ్గర వరకట్నానికి రివర్స్‌. అక్కడ కన్యాశుల్కం బాగా  పెరుగుతోంది. మార్కెట్‌లో లక్షలు పలుకుతోందట!

కరోనా వైరస్‌లాగా చైనా నుంచి కన్యాశుల్కం మనదేశానికి పాకుతుందేమోనని మన యూత్, పెళ్లి కాని ప్రసాద్‌ల బ్యాచ్‌.. చైనా బ్యాచ్‌ను చూసి  బెంబేలెత్తుతున్నారని సోషల్‌ మీడియా భోగట్టా. 

చైనా బ్యాచ్‌.. ‘కన్యాశుల్కం’
చైనాలో చాలా కాలంగా కన్యాశుల్కం ఆచారం ఉంది. కానీ అది నామ్‌కేవాస్తే లాగా ఉండేది. కమ్యూ­నిస్టు పాలనలో కూడా అది విజృంభిస్తూనే ఉంది. ఈ కన్యాశుల్కం 60–70వ దశకంలో  మంచా­లు, పరుపులు  లాంటి చిన్న గిఫ్టుల నుంచి, 80వ దశకంలో టీవీలు, ఫ్రిజ్‌ల దాకా చేరింది, 1990లలో అక్కడ  ఆర్థిక సంస్కరణల అమలు మొదలయ్యాక, కన్సూమరిజం పెరగడం, ఆర్థిక అంతరాలు పెరగడంతోపాటు లైంగిక వివక్ష పెర­­గడంతో కన్యాశుల్కం రాకెట్‌ వేగం అం­దు­­­కుంది. కార్లు, రియల్‌ ఎస్టేట్‌ దాకా పో­­యింది. ఇప్పుడు పురుషులు వధువుకు, వధువు కుటుంబానికి కానుకల రూపంలో లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తోందట.

కార్లు లాం­టి వాహ­న రూపంలో, ఆస్తుల రూపంలో సమర్పించుకుంటున్నారు. దీన్నే ‘బ్రైడ్‌ ప్రైస్‌’ అంటున్నారు. ఈ సంప్రదాయం ఎక్కువగా చైనా గ్రామీణ ప్రాంతంలో కనిపించేది. ఇప్పుడు సిటీలకు కూడా బాగా పాకుతోంది. ఇటీవల  ఓ వధువు కుటుంబం కోటి రూపాయలకు పైగా డిమాండ్‌ చేయ­డం, అది మీడియాలో బాగా చర్చ కావడంతో అందరి దృష్టి చైనా బ్యాచ్‌లర్ల కష్టాలపై పడింది.  చివరికి  చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా దీని­పై దృష్టి పెట్టడం దీని సీరియస్‌నెస్‌కు అద్దం పడుతోంది. 

చైనా ‘వన్‌’ వే..
చైనా ఏది చేసినా కరోనా స్థాయిలోనే చేస్తుంది. జనాభా పెరిగిపోతోందన్న ఆందోళనతో దశాబ్దాల పాటు ఒకే బిడ్డను కనాలన్న  ‘వన్‌ చైల్డ్‌’ పద్ధతిని చాలా సీరియస్‌గా  ఇంప్లిమెంట్‌ చేసింది. ఇండియాలో లాగానే.. మగబిడ్డ కావాలనే సెంటిమెంట్‌ చైనా సమాజంలో కూడా ఉంది. దానితో వారు కనే ఒక్క బిడ్డను మగబిడ్డను కనడానికే ఆసక్తి చూపారు. ఇది తీవ్ర లింగ వివక్షకు దారితీసి లింగ నిష్పత్తిని దారుణంగా దెబ్బతీసింది. మగబిడ్డ కావాలనే ఆకాంక్ష వల్ల అమ్మాయిల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2017లో చేసిన ఒక సర్వేలో 100 మంది పెళ్లికాని పురుషులకు 66 మంది పెళ్లి కానీ స్త్రీలే ఉన్నట్లు తేలింది. 

చైనాలో 1986 నుంచి ప్రతి మ్యారేజ్‌ను రిజిస్టర్‌ చేయాలన్న రూల్‌ తెచ్చారు. ఈ లెక్కల ప్రకారం  2021లో 76 లక్షల పెళ్లిళ్లు రిజిస్టర్‌  అయ్యాయి. పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య బాగా తగ్గింది. రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అనే నిబంధన వచ్చాక అతి తక్కువ పెళ్లిళ్లు అయిన ఏడాది ఇదే. యువత లేట్‌గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మ్యారేజ్‌ ఏజ్‌ పెరిగింది.  ఒంటరిగా ఉండిపోతున్న అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. తద్వారా కన్యాశుల్కం పెరుగుతోంది. అక్కడ అన్నీ ఆర్థిక హంగులున్న భోజరాజులకు మాత్రమే పెళ్లిళ్లు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఇక్కడా వస్తుందేమోనని చైనా బ్యాచ్‌ను చూసి మన ఇండియా బ్యాచ్‌ బ్యాచ్‌లర్ల భయం.

ఎంకరేజ్‌ ‘వ్యాక్సిన్‌’..
పైన చెప్పిన కారణాలు,  వన్‌చైల్డ్‌ సిస్టమ్‌తో జనాభా తగ్గిపోవడంతో వన్‌చైల్డ్‌ పద్ధతికి చైనా స్వస్తి పలికింది. అయినా 2022లో చైనా జనాభా తగ్గింది. ప్రపంచానికి భిన్న పోకడ ఇది. ఇది తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందేమోనన్న కంగారు పడుతున్న చైనా సర్కారు ఇప్పుడు ఎక్కువ మందిని కనాలని ఎంకరేజ్‌ చేస్తోంది. మ్యారేజ్‌ చేసుకున్న కొత్త దంపతులకు  ఇప్పటిదాకా మూడు రోజులు పెయిడ్‌ లీవ్‌లు ఉండేవి. ఇప్పుడు వాటిని 30 రోజులకు పెంచారు.

ప్రపంచంలోనే రెండు అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో యువకులకు పెళ్లిళ్లు కావడం కష్టం అవుతోంది. పెళ్లి.. ఆర్థిక, సామాజిక సమస్యగా మారింది. పెళ్లి ‘మార్కెట్‌’ కావడంతో ..మార్కెట్‌లో నిలబడలేని ఎంతోమంది పెళ్లి కాకుండానే ఉండిపోతున్నారు. ప్యాకేజీల కోసం, విదేశాల్లో ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నారు. చైనాలో పెరుగుతున్న కన్యాశుల్కం  ఓ రకంగా అమ్మాయిలను మార్కెట్లో పెట్టడమే.. అంగడి సరుకుగా మార్చడమే!

ఈ పరిస్థితి.. ఆడపిల్ల అమ్మ కడుపులో ఉండగానే సమాజం మూకుమ్మడిగా  కత్తులు దూసినందుకు తగిలిన ఉసురు కాదా..?.. ఇదీ సీరియస్‌ అంశం!
-సరికొండ చలపతి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top