జీవితంలో సాహిత్యాన్ని దర్శించిన విమర్శకుడు | Sakshi
Sakshi News home page

జీవితంలో సాహిత్యాన్ని దర్శించిన విమర్శకుడు

Published Sat, Dec 11 2021 2:49 PM

Papineni Shiva Shankar: Addepalli Kavitva Vimarsha Puraskar in Kakinada - Sakshi

‘‘కవిత్వానికి కవి ఇవ్వాల్సిందేమిటి? బహుశః తన రక్తమాంసాలివ్వాలి. సొంత భాషనివ్వాలి. అంతిమంగా తన ప్రాణమివ్వాలి. కవితకి భావాలు, భావ చిత్రాలు, అలంకారాలు ఇవ్వటం వేరు. ఇవి బాహ్య విషయాలు మాత్రమే. కవి రక్తమాంసాల్ని హరించినప్పుడే కవిత జవజీవాలు పొందుతుంది. ఒక మహా శిల్పం రూపొందించిన తర్వాత అంతిమంగా దానికి ప్రాణరేఖ చెక్కే శిల్పిలాంటి వాడే కవి. ప్రతి గొప్ప కవిత ప్రాణమున్న వ్యక్తే’’    – పాపినేని శివశంకర్‌

పది కాలాలపాటు నిలబడే కవిత్వం గురించి శివశంకర్‌ వ్యాఖ్యానం ఇది. ఈ వాక్యాలు చెప్పడానికి శివశంకర్‌ గమనింపు ఏమిటి? ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారు? ఎన్ని అధ్యయనం చేసి ఉండాలి? నాలుగు పుస్తకాలకు సమీక్షలు రాసి ప్రముఖ విమర్శకులుగా చెలామణీ అవుతున్న ఈ కాలంలో తెలుగు సాహిత్య విమర్శకు ‘శివశంకర్‌’ ఏమి ఇచ్చాడు? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ‘సాహిత్యం– మౌలిక భావనలు’ సిద్ధాంత గ్రంథం, ద్రవాధునికతను తెలుగు సాహిత్యానికి అన్వయించడం, నిశాంత పేరు మీద అందించిన సాహిత్య తాత్విక వ్యాసాలను మనం పరిశీలించినప్పుడు... కొన్ని అన్వయాలను, కొన్ని భావనలను, ధిక్కారం నిసర్గత లాంటి సాహిత్య సారాంశాన్ని తవ్వితీసే సాధనాలను రూపొందించటానికి కృషి చేసినట్టు తెలుస్తుంది. ‘మనిషి–ప్రకృతి–సమాజం’ అనే త్రికానికి సంబంధించిన సారాంశాన్ని రచయిత అర్థం చేసుకొని, ఆవిష్కరించగలగాలి. విలువలేని సాహిత్యాన్ని తూర్పారబట్టగలగాలని అంటారు.

‘విమర్శకుడు’ అనగానే పనిగట్టుకొని లోపాలు వెతకడం కాదు. మంచిచెడుల వివేచన ఉండాలి. సంయమనం ఉండాలి. వస్తువు, శిల్పం, అభివ్యక్తి, రూపం లాంటి నాలుగు పడికట్టు మాటలతో రచనని చూడటం శివశంకర్‌కి తెలియదు. కవిత్వీకరణకు సంబంధించి ప్రాచీనులు ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అనే మూడు హేతువులు అవసరం అన్నారు. ఇవాళ కవిత్వం రాస్తున్నవారికి ప్రాథమికంగా మూడు మౌలిక విషయాలను శివశంకర్‌ సూచిస్తున్నారు. ( మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన)

1. భావబలం, 2. భావనాబలం, 3. భాషాబలం. కవిత్వ విమర్శకుడిగా ఆయన చేసిన మరికొన్ని పరిశీలనలు చూస్తే. 1. కవిత్వం వైయుక్తికాన్ని సామాజిక దృక్పథం నుంచి విలువ కట్టే ఆలోచనా ధోరణి ప్రవేశించింది. 2. ఇవాళ కవిత్వంలో కనబడే ఒక ప్రధాన లక్షణం బహుముఖీనత. ఇక్కడ మహాకవి పదవులు, ఏక నాయకత్వాలు లేవు. ఏక సమయంలో ఎన్నో గొంతులు కలివిడిగా, విడివిడిగా వినిపిస్తున్నాయి. వస్తువు విస్తృతమైనది. కవిత్వాకాశ వైశాల్యం పెరిగింది. 3. దేశీయత లేదా స్థానీయత ఇప్పటి కవిత్వంలో ఒక ముఖ్యాంశం అయింది. ‘విశ్వం నుంచి నాదాకా’ అనే సూత్రం ముందుకొచ్చింది. 4. సొంత భాషని ఎంతగా లీనం చేసుకుంటే ఆ కవి కవిత్వం అంత నిసర్గంగా ఉంటుంది. 5. కవిత్వంమంటే భాష యొక్క ఉన్నత వ్యక్తీకరణ కాదు. అందమైన అభివ్యక్తీ కాదు. పదచిత్రాలు, భావ చిత్రాల పొహళింపు కాదు. జీవితాన్ని తార్కికంగా కాదు, తాత్వికంగా వివేచించాల్సి ఉంది. 

ఇకపోతే జిగ్మంట్‌ భౌమన్‌ చెప్పిన లిక్విడ్‌ మోడల్‌ని ‘ద్రవాధునికత’గా శివశంకర్‌ మనదైన జీవన విధానాలకు అనుగుణంగా అన్వయం చేశారు. శరవేగంగా మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ‘ద్రవాధునికత’ను ఒక పరికరంగా మన ముందుంచారు. వ్యక్తి, ప్రకృతి, సమాజం.. వీటిని వ్యాపారమయం చేసిన తీరు తెలిపారు. మనం ఒక ప్రవాహంలో పడిపోయాం. అది క్షణక్షణం మారిపోయే ప్రవాహం. రూపం మార్చుకున్న ప్రవాహం. ఎక్కడా విలువలు కనిపించవు. కొత్తదనంపై తీవ్రమైన మోజు, అర్ధరాహిత్య జీవనం, అమానవీయత, మానవ దూరం.. ఇవన్నీ ద్రవాధునికతలో భాగం. (Mannu Bhandari: రాలిన రజనీగంధ)

ఆయన మాటల్లో ద్రవాధునికత లక్ష్యం ఇది –
‘‘ఇవాళ ముఖ్యంగా నాగరిక, విద్యాధిక, ధనాధిక, కార్పొరేట్‌ వర్గ జీవన విధానంలో ద్రవాధునికత తెచ్చిన సరికొత్త మార్పు తేలిగ్గా గుర్తించగలం. అది మోగించే ప్రమాదఘంటికలు వినగలం. రకరకాల (అడ్డ)దారుల ద్వారా ఉరువైన నూతన సంపన్నవర్గం ఏర్పడింది. దానికి కరెన్సీ స్విమ్మింగ్‌ పూల్‌లో ఈదడం మహానందం. స్వసుఖ జీవనంతో తప్ప దానికి ఏ సామాజిక, వైయక్తిక విలువలతో పని లేదు.’’

‘ద్రవాధునికత’ స్థితిని దాటేందుకు కూడా ఆయన కొన్ని పరికరాల్ని చూపారు. ప్రకృతిలో మైత్రి, సామూహికం, పురానవం, నిరహంకారం, నిబ్బరం, సృజనాత్మకత లాంటి విలువైన మార్గాలు చూపారు. ఆయన ద్రవాధునికతను ఒక పనిముట్టుగా చేసుకున్నారు. దాని సాయంతో సమాజంలోని స్థితిగతులను వ్యాఖ్యానించి, మనం ఇంకా ఎంత మంచి మనుషులుగా మారాల్సి వుంటుందో గుర్తు చేశారు. మానవ జీవితం ఎట్లా ఉంది? ఎట్లా ఉండాలి అనే వైరుధ్యాన్ని పరిష్కరించే దిశగా రచనలు సాగాలని ఈ విమర్శకుడి ఉద్దేశం. ప్రపంచీకరణ సారాంశాన్ని, పతనీకరణ సారాంశాన్ని గుర్తించి ఎరుకతో ఎలా జీవించాలో హెచ్చరిస్తున్నారు. సాహిత్యంలో జీవితం గురించే కాదు, జీవితంలో సాహిత్యం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన విమర్శకుడు పాపినేని.


- డాక్టర్‌ సుంకర గోపాల్‌ 

వ్యాసకర్త తెలుగు సహాయాచార్యులు 
(కాకినాడలో పాపినేని శివశంకర్‌ ‘అద్దేపల్లి కవిత్వ విమర్శ పురస్కారం’ అందుకుంటున్న సందర్భంగా)

Advertisement

తప్పక చదవండి

Advertisement