ఆర్భాటాలు లేకుండా అభివృద్ధి పథం

Kommineni Srinivas Rao Article On AP Industrial Investments - Sakshi

దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆకర్షించిన పెట్టుబడుల విషయంలో మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలవడం మంచి పరిణామం. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఏపీకి ఇన్ని ప్రతిపాదనలు రావడం హర్షణీయం. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి పరిశ్రమలు రావేమోనన్న ఆందోళన ఉండేది. ప్రస్తుతం పెట్టుబడులలో ఏపీ రెండో స్థానంలో ఉండడంతో టీడీపీ మీడియా ఇంతవరకు అసత్య ప్రచారం చేసిందన్నది నిర్ధారణ అవుతోంది. కడప జిల్లాలో ఎలక్ట్రానిక్, లెదర్‌ కాంప్లెక్స్, కృష్ణపట్నం వద్ద 3 వేల కోట్లతో పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు.. నాలుగు నుంచి ఆరు ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ఊపందుకోవడం వంటి పరిణామాలన్నీ శుభ సంకేతాలే.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, ఏపీ ప్రజలకు కాస్త మంచిరోజులు వచ్చినట్లుగా ఉన్నాయి. అందుకే కొన్ని శుభ సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్‌ పెట్రోలియం రిఫైనరీ యూనిట్‌ ఏర్పాటు దిశగా ఒక అడుగు పడింది. కాకినాడ వద్ద పెట్రో కారిడార్‌ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం, రాష్ట్రం మధ్య సంప్రదింపులు ఆరంభం కావడం, వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు అవడం మంచి సంకేతమే అని చెప్పాలి. విభజన చట్టం ప్రకారం సుమారు 25 వేల కోట్ల పెట్టుబడితో యాంకర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఆయన భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్‌ అంతకుముందు ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఈ పరిణామం జరగడం ఆశాజనకంగా ఉంది. ఒకసారి ఈ యాంకర్‌ రిఫైనరీ ఏర్పాటైతే, పెట్రో కారిడార్‌గా ఇది అభివృద్ధి చెంది వివిధ రకాల పరిశ్రమలు వస్తాయని, తద్వారా రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కేంద్రం ఇందుకు పూర్తిగా సహకరిస్తేనే సాధ్యం అవుతుందని వేరే చెప్పనవసరం లేదు.

రాష్ట్ర విభజన తర్వాత ఏడేళ్లకు ఈ ప్రాజెక్టు కాస్త కదలడం ఆశాజనకంగా ఉందని చెప్పాలి. ఏపీలో రిఫైనరీ యూనిట్‌ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటు చేసినట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. ఇదే కాదు. తొలి త్రైమాసంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మహారాష్ట్ర రూ.54,714 కోట్ల పెట్టుబడులతో మొదటి స్థానంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌ రూ.29,784 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఆ తర్వాత స్థానంలో ఉన్న గుజరాత్‌ రూ.26,530 కోట్లు, తమిళనాడు రూ.24,000 కోట్లు, కర్ణాటక రూ.14,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు పొందగా, తెలంగాణ రాష్ట్రం రూ.12,961 కోట్ల పెట్టుబడులు పొందుతోందని ప్రాజెక్ట్స్‌ టుడే అనే సంస్థ నివేదిక వెల్లడించింది.

సాధారణంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు పారిశ్రామిక రంగంలో ముందంజలో ఉంటాయి. వీటితో ప్రస్తుతం ఏపీ పోటీపడటం ఆసక్తికరంగా ఉంది. దేశంలో ఈ ప్రాజెక్టులు, పరిశ్రమలు నిజంగానే ఆచరణ రూపం దాల్చవచ్చన్న అభిప్రాయం ఉంది. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఏపీకి ఈ ప్రతిపాదనలు రావడం హర్షణీయం. వీటిలో నీటిపారుదల ప్రాజెక్టుల పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ప్రజల జీవన స్థితిగతులను పెంచేవే. ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే తరహాలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ఉండి ఉండవచ్చు. ఉమ్మడి ఏపీ విభజన జరిగిన తర్వాత ఏపీకి పరిశ్రమలు రావేమోనన్న ఆందోళన ఉండేది. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూటర్న్‌ తీసుకున్న తర్వాత ఈ అనుమానం మరింత పెరిగింది. అయితే అదే సమయంలో గత సీఎం చంద్రబాబు విశాఖలో సదస్సులకు, దేశదేశాలు తిరిగి పెట్టుబడులు ఆకర్షించడానికి వందల కోట్లు వ్యయం చేసేవారు. వాటిద్వారా వాస్తవంగా ఎంత పెట్టుబడి వచ్చిందో నిజాలు చెప్పి ఉంటే ఇబ్బంది ఉండేదికాదు. కాని 20 లక్షల కోట్లు పెట్టుబడి అని, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేశాయని ప్రచారం చేయడంతో అది అబద్ధమని అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల పరిశ్రమలు రాలేదని బీజేపీతో చెడిన తర్వాత చంద్రబాబే స్వయంగా చెప్పేవారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక పలు పరిశ్రమలు వెళ్లిపోయాయని, తెలుగుదేశం పార్టీ  పెద్దఎత్తున తన మీడియా ద్వారా ప్రచారం చేయిం చింది, చేయిస్తోంది. టెంపుల్టన్‌ అనే కంపెనీ ఆర్థిక సమస్యలతో ఇండియాలో తన కార్యకలాపాలు తగ్గించుకుంటే, అదేదో జగన్‌ ప్రభుత్వం వల్ల వెనక్కి పోతున్నట్లుగా దిక్కుమాలిన ప్రచారానికి పాల్పడిందన్న విశ్లేషణలు వచ్చాయి. అనంతపురం నుంచి కియా కార్ల ఫ్యాక్టరీ తరలిపోతోందని వదంతి పుట్టించారు. కానీ ఆ కంపెనీ మరో 400 కోట్ల అదనపు పెట్టుబడి పెడతామని ప్రకటించింది. అది కూడా శుభ పరిణామమే. ప్రస్తుతం పెట్టుబడులలో రెండో స్థానంలో ఉండడంతో టీడీపీ మీడియా అసత్య ప్రచారం చేసిందన్నది నిర్ధారణ అవుతోంది.

ఇటీవలి కాలంలో కడప జిల్లాలో ఎలక్ట్రానిక్, లెదర్‌ కాంప్లెక్స్‌లకు జగన్‌ శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం వద్ద సుమారు 3 వేల కోట్లతో పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రామాయపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, భావనపాడులతో సహా మొత్తం నాలుగు నుంచి ఆరు ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. విశాఖపట్నంలో ఆదాని డేటా సెంటర్‌కు 130 ఎకరాల భూమి కేటాయించారు. విశాఖపట్నంలో స్టీల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కరోనా నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలలో పనిచేసే ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ నిపుణులు తమ గ్రామాలకు వచ్చి అక్కడ వైఫై ఆధారంగా పని చేయడం వల్ల గ్రామాలలో కొత్త కళ సంతరించుకుందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఒక కథనాన్ని ఇచ్చింది. తమిళనాడులోని అంబత్తూరు పారిశ్రామికవాడలో స్థలం తగ్గిపోవడం, కాలుష్యం పెరిగిపోవడం వల్ల, చిత్తూరు జిల్లాలో 2 వేల ఎకరాల భూమిని తీసుకుని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీటికి తోడు సీఎం జగన్‌ అమలు చేసిన చేయూత పథకం కింద చిన్న, చిన్న యూనిట్లను పెట్టినవారి ఉత్పత్తుల మార్కెటింగ్‌కు రిలయన్స్, ఐటీసీ తదితర సంస్థలతో ఒప్పం దాలు చేసుకున్నారు. పాల ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేసే కృషిలో భాగంగా అమూల్‌ సంస్థను ఏపీకి తీసుకువచ్చారు. ఇలా ఆయా స్కీముల అమలుకు అడుగులు పడుతుండటం సంతోషకరం.

ప్రభుత్వపరంగా ఎన్ని లక్షల ఉద్యోగావకాశాలు సృష్టించినా, ఏదో ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. ఆరు లక్షల ఉపాధి అవకాశాలు ఇచ్చి, తాజాగా పదివేల ఉద్యోగాలకు పైగా జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించినా, కొందరు దానిపై విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు అసలు ప్రభుత్వంలో ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయని అనేవారు. అయినా జగన్‌ ఆ విషయంలో చేసిన కృషి చిన్నదేమీ కాదు. అయినా ప్రభుత్వంతో పాటు, ప్రైవేటురంగంలో కూడా ఇతోధికంగా అవకాశాలు రావల్సి ఉంటుంది. కేంద్రం ప్రత్యేక హోదాను ఇచ్చినట్లయితే పెట్టుబడులు మరింత అధికంగా వచ్చి ఉండేవి. కొత్తగా భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తి అయితే కూడా ఆ ప్రాంత అభివృద్ధికి అది దోహదపడుతుంది. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కూడా కార్యరూపం దాల్చితే రాయలసీమలో ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. అంతేకాక అమరావతి ప్రాంతంలో అగ్రికల్చరల్‌ హబ్‌ తదితర రంగాలకు చెందిన యూనిట్లు వస్తే ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. గతంలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి జగన్‌పై కేసులు పెట్టిన నేపథ్యంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్య వాన్‌పిక్‌ ప్రాజెక్టు కూడా సీబీఐ కేసులో చిక్కుకుని ఆగిపోయింది. ఆ ప్రాజెక్టు కూడా క్లియర్‌ అయితే ఏపీలో పరిశ్రమల స్థాపన వేగం పుంజుకునే అవకాశం ఉంటుంది. ప్రచారం హంగామా లేకుండా ఏపీ ప్రభుత్వం వీటిని చేసుకుపోవడం కూడా మంచిదే. లేకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి శుభ సంకేతాలే కాని, పూర్తిగా ప్రాజెక్టులూ, పరిశ్రమలూ వచ్చేశాయని అనుకోరాదు. అందుకోసం ప్రభుత్వం ఇంకా చాలా కృషి చేయవలసి ఉంది. అప్పుడే పెట్టుబడిదారులకు ఒక నమ్మకం, విశ్వాసం పెరుగుతాయి. వైఎస్‌ జగన్‌పై ఏర్పడిన విశ్వసనీయత అంశం ఇందుకు బాగా దోహదపడవచ్చు. అందువల్ల వైఎస్‌ జగన్‌కు, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులకు ఆల్‌ ద బెస్ట్‌ చెబుదాం.

కొమ్మినేని శ్రీనివాస రావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top