ఆమె నాట్యం... మూడుకోట్ల వ్యూస్‌

Three crore views Sheema Kirmani dance - Sakshi

సాధారణంగా ఏడు పదులకు పైబడిన వయసులో చకచకా నడవడమే గొప్ప. అలాంటిది నాట్యం చేస్తే ఎలా ఉంటుంది? అదీ చీరకట్టులో... షీమా కిర్మానీ అయితే అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తారు. ఇటీవల ఆమె నాట్యం చేస్తూ విడుదల చేసిన ‘పసూరి’ వీడియో యూట్యూబ్‌లో తెగ సందడి చేస్తోంది. ఇప్పటి దాకా దాదాపు మూడు కోట్లమంది ఈ వీడియోను చూశారు. పాకిస్థాన్‌ లో బాగా పాపులర్‌ అయిన మ్యూజిక్‌ టీవీ సీరీస్‌– 14లో భాగంగా ఈ వీడియోను విడుదల చేశారు. గత నలభై ఏళ్లుగా సంప్రదాయ చీరకట్టులోనే నాట్యం చేస్తూ పాకిస్థానీ మహిళల స్వేచ్ఛ, హక్కుల కోసం పోరాడుతున్నారామె.

రావల్పిండిలోని ఓ బ్రిగేడియర్‌ కుటుంబంలో పుట్టి పెరిగిన షీమా కిర్మానీకి చిన్న వయసునుంచే నాట్యం మీద ఎనలేని మక్కువ. షీమా తల్లి హైదరాబాద్‌కు చెందిన వారు. ఆమె ఎక్కువగా చీరనే ధరించేవారు. చిన్నప్పటినుంచి ఆమె చీరకట్టు చూస్తూ పెరిగిన షీమా తను కూడా చీర కట్టుకోవడానికి ప్రయత్నించేది. దేశ విభజన జరగడంతో.. కుటుంబం రావల్పిండికి మారింది. అయినప్పటికీ ప్రతి వేసవికాలం సెలవులకు ఇండియా వచ్చేది. దీంతో ఆమెకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై ఆసక్తి ఏర్పడింది. ఈ ఆసక్తితో స్కూలు చదువు పూర్తయ్యాక, లండన్‌ లో ఫైన్‌  ఆర్ట్స్‌ లో డిగ్రీ పూర్తిచేసింది. లండన్‌ లో ఉన్నప్పుడు అక్కడి మహిళలకు ఉన్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ఆమెను ఎంతగానో ఆకర్షించాయి. ఇతర ప్రపంచ దేశాల్లో ఎక్కడాలేని నిబంధనలు పాకిస్థాన్‌ లోనే ఉండడం తనకి నచ్చలేదు. దీంతో 1979లో ‘తెహ్రీక్‌–ఇ–నిస్వాన్‌ ’ అనే స్త్రీవాద గ్రూపును ప్రారంభించి, మహిళల కనీస హక్కుల కోసం పోరాటం మొదలు పెట్టింది.

ఔరత్‌ మార్చ్‌...
ఎనభయ్యవ దశకంలో ఢిల్లీ వచ్చిన షీమా.. భరతనాట్యం, ఒడిస్సీలలో శిక్షణ తీసుకుంది. శిక్షణ పూర్తయిన తరువాత కరాచీకి తిరిగి వెళ్లింది. కానీ అప్పుడు జనరల్‌గా పనిచేస్తోన్న జియా ఉల్‌హక్‌.. పాకిస్థాన్‌ లో అంతా ఇస్లాంనే అనుసరించేలా సరికొత్త నిబంధనలు తీసుకొచ్చారు. భారతీయ స్త్రీలు ధరించే చీరలను అక్కడ ధరించకూడదని నిషేధం విధించారు. నాట్యం చేయడానికి కూడా అనుమతి లేదు. అప్పుడే శాస్త్రీయ నృత్యకారిణిగా పట్టభద్రురాలైన షీమాకు ఆ నిబంధనలు అస్సలు మింగుడు పడలేదు. తన భావాలను వ్యక్తం చేయడానికి నాట్యం మంచి సాధనమని భావించిన షీమా అక్కడి నిబంధనలకు విరుద్ధంగా చీరకట్టుకుని నాట్యం చేసేది. ఇందులో భాగంగానే ‘ఔరత్‌ మార్చ్‌’ పేరిట ప్రదర్శనలు ఇస్తూ మహిళల హక్కుల గురించి గొంతెత్తి చెబుతోంది. ప్రతి సంవత్సరం ఉమెన్‌ ్సడేకు ఔరత్‌ మార్చ్‌ను నిర్వహిస్తూ సమాన
హక్కుల కోసం పోరాడుతోంది.

2017లో ప్రముఖ లాల్‌ షహబాజ్‌ క్వాలందర్‌ మందిరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో అనేకమంది చనిపోయారు. అప్పుడు దానికి నిరసనగా షీమా తన తెహ్రీక్‌ గ్రూపుతో కలిసి ఆ మందిరం వద్దకు చేరుకుని ‘ధమాల్‌’ను ప్రదర్శించింది. ధమాల్‌ అనేది ఒకరకమైన నృత్యం. దీనిని దర్గాలలో సూఫీ సాధువులు వారి ఆరాధనలో భాగంగా చేస్తారు. ధమాల్‌ను ప్రదర్శించి అప్పుడు కూడా వార్తలో నిలిచింది. గత నలభై ఏళ్లుగా డ్యాన్‌ ్స చే స్తూనే మహిళా హక్కుల కోసం పోరాడుతోంది. ఎంతోమంది అధికారుల ఆగ్రహానికి లోనైనప్పటికీ తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. అంతేగాక ఎంతోమంది విద్యార్థులకు నాట్యం నేర్పిస్తూ వారిలో అవగాహన కల్పిస్తోంది. సంకల్పం ఉంటే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చనడానికి ఉదాహరణగా నిలుస్తోంది షీమా.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top