
భూమి పైనుంచి భారీ టెలిస్కోప్ ఒకటి ఈ విశ్వాంతరాళంలో కలియదిరిగేందుకు సిద్ధమౌతోంది! కొత్త గెలాక్సీలను, ప్రమాదకరమైన గ్రహ శకలాలను, ఆఖరికి గ్రహాంతర జీవుల ఉనికిని సైతం అది కనిపెట్టనుంది! ఈ ఏడాదిలో పని ప్రారంభించనున్న ఆ టెలిస్కోప్, వచ్చే పదేళ్లలో 2 వేల కోట్ల గెలాక్సీల ఆచూకీని కనిపెట్టనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే – ‘లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్’ ప్రాజెక్టులో భాగం చిలీలోని రూబిన్ అబ్జర్వేటరీ తన ‘సిమోన్యీ సర్వే టెలిస్కోప్’లో అమర్చిన అతి శక్తిమంతమైన మూడు కళ్ల కెమెరా... చుక్కల్లో చెడుగుడు ఆడబోతోంది. దిక్కుల దాగుడు మూతల్ని తెరవబోతోంది!
చిలీలోని ‘వీరా సి రూబిన్’ అంతరిక్ష పరిశోధన శాల (అబ్జర్వేటరీ) తన చరిత్రాత్మకమైన ఖగోళ పరిశోధనకు చేసుకుంటున్న ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. రహస్య నక్షత్ర మండలాలు, భూమిని ఢీకొట్టగల గ్రహ శకలాలు, అంతుచిక్కని గ్రహాంతర జీవుల ఉనికిని నైతం కనిపెట్టేందుకు రూబిన్ అబ్జర్వేటరీ ఈ అండ పిండ బ్రహ్మాండమైన ప్రాజెక్టును చేపట్టింది. అందుకోసం అత్యంత శక్తిమంతమైన మూడు కళ్ల ‘ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా’ను తన టెలిస్కోప్‌లో అమర్చుకుంది.
తొలి ప్రయోగం సక్సెస్
ఈ ఏడాది జూన్ 23 న, ప్రయోగాత్మకంగా రూబిన్ కెమెరా (ఇదే ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా) ఖగోళ శాస్త్రవేత్తలనే అబ్బురపరచే ఫొటోలను తీసింది. ఆ అపూర్వమైన ఛాయా చిత్రాలలో గెలాక్సీ సమూహాలు, సుదూర నక్షత్రాలు, నెబ్యులా (ప్రకాశవంతమైన అంతరిక్ష మేఘం) ఉన్నాయి. ఒక కారు సైజులో 3.2 గిగాపిక్సెల్‌తో ఉండే ఆ కెమెరా తీసిన ఒక ఫొటోలో 4,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నెబ్యూలా కనిపించింది!
అబ్జర్వేటరీకి ఉండే టెలిస్కోప్ వేగంగా వెంటవెంటనే చిత్రాలను తీస్తుంది కాబట్టి, అందులోని కెమెరా అంతరిక్ష మండలానికి ఆవల ఉన్న నక్షత్రాల గుంపు నుండి కూడా కదిలే వస్తువులను పట్టుకోగలదు. ఒక అంతరిక్ష శిల భూమి వైపు వస్తుంటే కనిపెట్టేయనూగలదు.
హబుల్, జేమ్స్‌ల కన్నా పవర్‌ఫుల్
మానవాళిని అప్రమత్తం చేసే విషయమై ఇప్పటికే ఇతర శక్తిమంతమైన టెలిస్కోప్‌లు పనిలో ఉన్నాయి. ఉదాహరణకు, ‘జేమ్స్ వెబ్’ టెలిస్కోప్ భూమి నుండి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో స్థిరంగా ఒక చోట ఉంటుంది. అంతరిక్షంలోని నిర్దిష్ట లక్ష్యాలను దగ్గరగా చూడటమే ఈ టెలిస్కోప్ ప్రధాన విధి. జేమ్స్ వెబ్ కన్నా ముందున్న ‘హబుల్ టెలిస్కోప్’ ప్రస్తుతం భూమికి 500 కి.మీ కంటే ఎక్కువ ఎత్తులో కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంది.
1995లో హబుల్ దాదాపు ఒక వారం పాటు ఛాయా చిత్రాల్ని ఒడిసిపట్టి ‘హబుల్ డీప్ ఫీల్డ్ ఇమేజ్‌గా’ ప్రస్తుతం ప్రసిద్ధిలో ఉన్న ఫొటోను తీసింది. విశ్వాంతరాళాల్లోని 3,000 కు పైగా గెలాక్సీలు ఆ ఫొటోలో పడ్డాయి. దానికి మించిందే తాజా రూబిన్ ప్రాజెక్ట్ కెమెరా.
40 చంద్రుళ్లు పట్టేస్తారు
రూబిన్ అబ్జర్వేటరీ, ఏప్రిల్‌లో తన మొదటి టెస్ట్ రన్ సమయంలో, కొన్ని గంటల్లోనే కోటి గెలాక్సీలను ఫొటో తీసింది. రూబిన్‌కు ఉన్న ప్రత్యేకత వల్లనే ఆ స్థాయిలో ఫొటో తీయటానికి సాధ్యమైంది. జేమ్స్ వెబ్, హబుల్ టెలిస్కోపులు మాదిరిగా కాకుండా, ఆకాశంలోని చిన్న భాగాలను చూడగల రూబిన్ సిమోన్యీ ఒక సర్వే టెలిస్కోప్. అంటే ఇది నిర్దిష్ట వస్తువులను కాకుండా మొత్తం పెద్ద చిత్రాన్ని చూపిస్తుంది.
ఇది తీసే చిత్రం 40 నిండు పున్నమిలకు సమానమైన ఆకాశం మొత్తాన్ని చుట్టేస్తుంది. అదే జేమ్స్ వెబ్‌కు ఉన్న కెమెరాలు పౌర్ణమి కంటే తక్కువ విస్తృతి కలిగిన ఆకాశ క్షేత్రానికి పరిమితం అవుతాయి. రూబిన్ నుండి తీసిన ఒక ఫొటో చాలా పెద్దదిగా ఉంటుంది. దానిని పూర్తి స్థాయిలో చూడటానికి 400 అల్ట్రా హెచ్.డి. టీవీ స్క్రీన్‌లు అవసరం అవుతాయి.
‘టైమ్–లాప్స్’ సాంకేతికత
ఆకాశంలోని అసాధారణ విశేషాలను కనిపెట్టేందుకు 10 ఏళ్ల కాలపరిమితి గల ‘లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్’ (ఎల్.ఎస్.ఎస్.టి.) అనే ఈ ప్రాజెక్టు రూబిన్ రూపొందించింది. ఇందులోని టెలిస్కోప్ 300 టన్నులకు పైగా బరువైన ఉక్కు, గాజుతో తయారైంది. కార్బన్ డైఆకైడ్‌తో ఒక తీరుగా శుభ్రం అవుతుంటుంది. రాబోయే దశాబ్ద కాలంలో ఈ టెలిస్కోప్, అందులోని భారీ ఎల్.ఎస్.ఎస్.టి.
కెమెరా ప్రతి 3–4 రాత్రులకు దక్షిణార్ధ గోళ ఆకాశాన్ని ఫొటోలు తీస్తుంది. ఇది ఈ మహా విశ్వాన్ని మునుపెన్నడూ లేని విధంగా నిర్ణీత వ్యవధిల్లో ఫ్రేమ్‌ల క్రమాన్ని తీసుకునే ‘టైమ్–లాప్స్’ సాంకేతికతతో ఫొటో తీస్తుంది. ‘‘మేము ప్రతి 30 సెకన్లకు రాత్రిపూట ఆకాశాన్ని గమనిస్తుంటాము కాబట్టి ఒక్కొక్కటి 15 సెకన్ల రెండు వరుస చిత్రాలలో, దాని స్థానం లేదా ప్రకాశాన్ని మార్చుకున్న ఏ వస్తువునైనా మేము పట్టుకోగలం’’ అని రూబిన్ ఏడాది పాటు పని చేసిన క్షితిజ కేల్కర్ తెలిపారు.
చిలీలోని సెర్రో పాచోన్ పర్వతంపై రూబిన్ అబ్జర్వేటరీ ఉంటుంది. దీని వల్ల– స్థానికంగా వాతావరణ పొరలోని వెచ్చని గాలుల్లో, పై నుంచి వచ్చే శీతల పవనాలు కలిసిపోయి, తద్వారా ఏర్పడే కల్లోల వాయువుల ప్రభావం అబ్జర్వేటరీ వరకు రాదు.
దాంతో నత్రాలను స్పష్టంగా చూడొచ్చు. 800 మిలియన్ డాలర్ల ఖర్చుతో, 20 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న రూబిన్‌కు ప్రస్తుతం తుది తనిఖీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి లోగా ఎప్పుడైనా రూబిన్ పని అధికారికంగా ఆరంభం కావచ్చు. భూమిపై అతి పెద్ద కెమెరా అయిన ఎల్.ఎస్.ఎస్.టి మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని అణువణువున పట్టి బంధించబోతోంది.
4 వేల కోట్లువచ్చే 10 ఏళ్ల నిర్దిష్ట కాలానికి రూబిన్ అబ్జర్వేటరీ కనిపెట్టనున్న అంతరిక్ష విశేషాలు. ఇంత భారీగా ఖగోళ సమాచారాన్ని ఇప్పటి వరకు రాబట్టింది లేదు రూబిన్ అబ్జర్వేటరీలో ‘సిమోన్యీ సర్వే టెలిస్కోప్’ లోపలి ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా
5 అ. 5 అం.: ఎల్.ఎస్.ఎస్.టి. ఎత్తు
3 : ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా లోపల ఉన్న లెన్సులు;
5 అడుగులు : మూడు లెన్సులలో పెద్ద లెన్సు వ్యాసం
40 కెమెరా దృష్టి క్షేత్రంలో పట్టే పూర్ణ చంద్రుళ్లు
3,200 రూబిన్ కెమెరా మెగా పిక్సెల్స్
12–50 మామూలు కెమెరాల మెగా పిక్సెల్స్
రూబిన్ అబ్జర్వేటరీ ఒక రౌండుకు 20 లక్షలకు పైగా చిత్రాలను తీస్తుంది. ప్రతి రాత్రి 20 టెరాబైట్‌ల సమాచారాన్ని సంగ్రహిస్తుంది. అది 50 ఏళ్ల మొత్తం డిజిటల్ మ్యూజిక్‌కి, ఒక లక్ష హై రిజల్యూషన ఆర్ట్ వర్క్‌లకు, లేదా 70 లక్షల 70 వేల ఇ–బుక్‌లకు సమానం.
సాక్షి, స్పెషల్ డెస్క్
(చదవండి: స్క్రీన్ అడిక్షన్ హద్దుల్లేకుంటే ఇక్కట్లు తప్పవు)