గేమింగ్‌లో గెలుపు జెండా.. ‘పాయల్‌ ధారే’ విజయపథం

Payal Dhaare One Of The Biggest Indian YouTube Women Gamers - Sakshi

‘ఉమన్‌ గేమర్‌! వినడానికి కొత్తగా ఉంది’ అని ఒకరు ఎగతాళిగా నవ్వారు. ‘ఆడడం బాగానే ఉంటుందిగానీ, కెరీర్‌కు బాగుండదు’ అని గంభీరస్వరంతో నిరాశ పరిచారు మరొకరు. అంతా అయోమయంగా ఉంది. అలా అని ఆగిపోలేదు. ఓనమాలు నేర్చుకుంటూనే, కొత్త విషయాలపై పట్టు సంపాదిస్తూనే మేల్‌–డామినేటెడ్‌ స్పేస్‌ అనుకునే గేమింగ్‌లో బిగ్గెస్ట్‌ యూట్యూబ్‌ ఉమన్‌ గేమర్‌(ఇండియా)గా గెలుపు జెండా ఎగరేసింది పాయల్‌ ధారే...

కరోనా మహమ్మారి పదునుగా కోరలు చాస్తున్న సమయంలో, లాక్‌డౌన్‌ రోజుల్లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన పాయల్‌ ధారే గేమింగ్‌–ఫోకస్‌డ్‌ ఛానల్‌కు శ్రీకారం చుట్టింది. నిజం చెప్పాలంటే యూట్యూబ్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌పై లైవ్‌స్ట్రీమింగ్‌ కంటెంట్‌ గురించి ఆమెకు అంతగా అవగాహన లేదు. కాలేజీలో స్నేహితులతో కలిసి ‘పబ్జీ’ గేమ్‌ ఇష్టంగా ఆడేది. ‘పబ్జీ’ని నిషేధిస్తారనిగానీ, గేమింగ్‌ను తాను కెరీర్‌గా ఎంచుకుంటాననిగానీ అనుకోలేదు పాయల్‌. గేమింగ్‌పై ఇష్టం పెరుగుతున్న క్రమంలో తన మనసులో మాటను ఇంట్లో చెప్పింది.

‘గేమింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంటాను’
తల్దిదండ్రులు ససేమిరా అన్నారు. ‘చదువుపై దృష్టి పెట్టు’ అని మందలించారు. వారిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అలా తొలి విజయం సాధించింది పాయల్‌. తాము ఉండే చింద్వారా పట్టణంలో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అంతంత మాత్రమే. మొదట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో గేమింగ్‌ సెషన్స్‌ క్లిప్స్‌ను పోస్ట్‌ చేసేది. 100కె ఫాలోవర్స్‌తో తన మీద తనకు నమ్మకం వచ్చింది. ఈ సమయంలోనే  యూట్యూబ్‌లో ప్రయత్నించమని స్నేహితులు, ఫాలోవర్స్‌ నుంచి ఒక సూచన వచ్చింది. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం సులభం కాబట్టి మొదట దాన్నే ఎంచుకున్నాను. మీ గేమింగ్‌ స్కిల్స్‌కు యూట్యూట్‌ అనేది సరిౖయెన వేదిక అనే సలహాతో పాయల్‌ గేమింగ్‌ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ మొదలు పెట్టాను’ అంటుంది పాయల్‌. ఛానల్‌ మొదలైన తరువాత రకరకాల విషయాలు స్వయంగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ప్రేక్షకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేది. లైవ్‌స్ట్రీమింగ్‌ గురించి ఎన్నో రోజులు రిసెర్చ్‌ చేసింది. ఎలాంటి కంటెంట్‌ను ప్రజలు ఇష్టపడుతున్నారు? లైవ్‌స్ట్రీమింగ్‌ పనితీరు ఎలా ఉంటుంది? ఇప్పుడున్న గేమింగ్‌ ఛానల్స్‌కు భిన్నంగా ఎలా ప్రయత్నించవచ్చు....ఇలా రకకరాల విషయాలపై లోతైన పరిశోధన చేసింది.

పాయల్‌ కాస్త సిగ్గరి. నలుగురి ముందు మాట్లాడాలంటే భయం. కెమెరా ఫేస్‌ చేయాలంటే కష్టం. ‘ఒకటి సాధించాలని బలంగా అనుకొని బరిలోకి దిగితే, వారిలోని రెండు లోపాలు మాయమవుతాయి’ అంటారు. పాయల్‌ విషయంలోనూ అదే జరిగింది. బరిలోకి దిగిన తరువాత కెమెరాను హాయిగా ఫేస్‌ చేయడం నేర్చుకుంది. బెటర్‌ ఇంటర్నెట్‌ కోసం సొంత పట్టణం వదిలి, అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి మారాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు వద్దని గట్టిగా చెప్పారు. వారిని ఒప్పించడానికి చాలా సమయమే పట్టింది. అయితే ఇక్కడికి మారిన తరువాత సబ్‌స్కైబర్‌ల సంఖ్య బాగా పెరిగింది. మొదట్లో తనకు పేరున్న గేమర్స్‌లాగా పర్సనల్‌ కంప్యూటర్‌ సెటప్‌ లేదు. లైవ్‌స్ట్రీమ్, అప్‌లోడ్‌కు తన దగ్గర ఉన్న ఫోన్‌ తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు మాత్రం తన దగ్గర డ్యూయల్‌ మానిటర్స్‌తో కూడిన మంచి పీసీ సెటప్‌ ఉంది. ‘పాయల్‌ గేమింగ్‌’ ఛానల్‌ 2.5 మిలియన్‌ సబ్‌స్రైబర్‌లతో దూసుకుపోతుంది. ఈ విజయాన్ని పాయల్‌ ఊహించలేదు. అయితే ఇది అంత సులువుగా దక్కిన విజయం కాదు.
‘సబ్‌స్క్రైబర్‌లు కొద్దిమంది మాత్రమే ఉన్నప్పుడు పెద్దగా ఎవరి దృష్టి ఉండదు. అయితే అదే ఛానల్‌ విజయవంతంగా దూసుకుపోతున్నప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. ప్రోత్సహించే వారి కంటే రాళ్లు రువ్వే వాళ్లే ఎక్కువగా ఉంటారు. నా లైవ్‌స్ట్రీమ్స్‌పై కొందరు హేట్‌ కామెంట్స్‌ చేశారు. కొందరు బాడీ షేమింగ్‌ చేశారు. మొదట్లో బాధపడేదాన్ని. వారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే విషయం అర్థమైన తరువాత వాటిని తేలికగా తీసుకున్నాను’ అంటుంది పాయల్‌. విజయం కోసం పోరాటం ఎంత ముఖ్యమో, ఆ విజయాన్ని నిలుపు కోవడం కోసం గట్టిగా నిలబడడం కూడా అంతే ముఖ్యం. పాయల్‌ ధారే ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉంది.

ఇదీ చదవండి: విలేజ్‌ నుంచి విదేశాలకు: పూజా, ఆశా, సుర్భి ఏం చేస్తున్నారంటే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top