కళ: అమెరికాలో పుష్పవిలాసం

Indian artist Pushpa Kumari exhibited as part of Global Positioning - Sakshi

కొన్ని చిత్రాలు ‘ఆహా’ అనిపిస్తాయి.
కొన్ని చిత్రాలు ‘అద్భుతం’ అనిపిస్తాయి.
కొన్ని చిత్రాలు మాత్రం ‘ఆహా అద్భుతం’ అనిపిస్తూనే ఆలోచించేలా చేస్తాయి.
పుష్ప చిత్రాలు ఈ కోవకు చెందినవే...

కొన్ని చిత్రాలు ‘ఆహా’ అనిపిస్తాయి.
కొన్ని చిత్రాలు ‘అద్భుతం’ అనిపిస్తాయి.
కొన్ని చిత్రాలు మాత్రం ‘ఆహా అద్భుతం’
అనిపిస్తూనే ఆలోచించేలా చేస్తాయి.
పుష్ప చిత్రాలు ఈ కోవకు చెందినవే...

మాన్హాటన్‌ (యూఎస్‌) 86 స్ట్రీట్‌లోని బస్‌షెల్టర్‌లో కనిపించిన ఒక చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సంప్రదాయ కళాప్రేమికులు, ఆధునిక కళాప్రేమికులు... ఇద్దరూ ఇష్టపడే చిత్రం అది. ‘జాయ్‌ ఆఫ్‌ లివింగ్‌’ అనే ఆ చిత్రాన్ని గీసింది మన ఇండియన్‌ ఆర్టిస్ట్‌ పుష్పకుమారి. గత రెండు సంవత్సరాల కరోనా కల్లోల చీకటిని వస్తువుగా తీసుకొని, ఆశావాద దృక్పథాన్ని ప్రతిఫలించేలా గీసిన  చిత్రం అది.

అమెరికాకు చెందిన ‘పబ్లిక్‌ ఆర్ట్‌ ఫండ్‌’ అనే నాన్‌–ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ న్యూయార్క్, బోస్టన్, షికాగోలలో పుష్పకుమారి చిత్రప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ చిత్రాలను సాధారణ కళాప్రేమికుల నుంచి చేయి తిరిగిన చిత్రకారుల వరకు ప్రశంసిస్తున్నారు.
పేరులోనే ‘కళ’ ధ్వనించే మధుబని (బిహార్‌) జిల్లాలోని రంతి అనే గ్రామంలో పుట్టింది పుష్ప కుమారి.

రంతి అనేది ఊరు అనడం కంటే ‘ఊరంత బడి’ అనడం సమంజసం. ఎటు చూసినా ఆబాలగోపాలం చేతిలో మధుబని మధుర కళావిన్యాసాలే! పుష్ప అమ్మమ్మ మహాసుందరిదేవి మధుబని ఆర్ట్‌ను అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లిన తొలితరం కళాకారుల్లో ఒకరు. అమ్మమ్మ ఒడిలో ఆర్ట్‌పాఠాలు నేర్చుకుంది పుష్ప. పదమూడేళ్ల వయసులోనే కుంచె పట్టిన పుష్ప కాలంతో పాటు తన కళను మెరుగు పరుచుకుంటూ వస్తోంది.

మొదట్లో అందరూ గీసినట్లే తాను గీసేది. తరువాత కాలంలో మాత్రం తనదైన ప్రత్యేకత గురించి ఆలోచించింది.
‘సింబాలిజం’ను సంప్రదాయ కళలోకి తీసుకురావడం ఒకింత కష్టమైన పని. అయితే ఆ కష్టం పుష్ప చిత్రాలలో కనిపించదు. దీనికి కారణం సింబాలిజంను సృజనాత్మకంగా మధుబనిలోకి తీసుకురావడమే. అమ్మమ్మ కుంచె నుంచి అందమైన చిత్రాలను నేర్చుకోవడమే కాదు, ఆమె నోటి నుంచి పురాణాలు, జానపద కథలు ఎన్నో విన్నది పుష్ప. అవేమీ వృథా పోలేదు. తన కళకు ఇంధనంగా పనికి వచ్చాయి.

పుష్ప కళాప్రపంచంలో కేవలం కళ మాత్రమే కనిపించదు. సమాజం కూడా కనిపిస్తుంది.
స్థూలంగా చెప్పాలంటే సంప్రదాయ కళ అనే పునాది మీద తనదైన దృశ్యభాషను సృష్టించుకుంది పుష్ప.
సామాజిక,రాజకీయ సమస్యలు, జెండర్‌ సమస్యలు, పర్యావరణ సంబంధిత అంశాలను కేంద్రంగా చేసుకొని చిత్రాలు గీస్తుంది పుష్ప. నాగరికత అనే పేరుతో భూమాతను ఎంత హింస పెడుతున్నామో ‘ఎర్త్‌–2’ చిత్రంలో కనిపిస్తుంది. ఇటీవల కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని గీసిన చిత్రాలకు మంచి స్పందన లభించింది. ‘నేను గీసే ప్రతి చిత్రానికి తనదైన భావవ్యక్తీకరణ ఉండేలా చూసుకుంటాను’ అంటుంది పుష్ప.

బోల్డ్‌ స్ట్రైకింగ్‌ ఫిగర్స్‌ గీయడంలో దిట్ట అనిపించుకున్న పుష్ప చిత్రాలలో రంగుల ఆర్భాటం కనిపించదు. సాదాసీదా ఇంక్‌బాటిల్‌నే ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంది.
‘చిత్రాలు మౌనంగా కనిపిస్తాయి. కాని ఆ మౌనంతోనే అవి మనతో మాట్లాడేలా చేయడం ఆర్టిస్ట్‌ విశిష్ఠత’ అని చెబుతారు విశ్లేషకులు. పుష్పకుమారి గీసిన చిత్రాలను చూస్తే... అవి మౌనంగా మాట్లాడే చిత్రాలు అనే విషయం కొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top