Disha Bill: సత్వర పరిష్కార దిశ

Disha Bill: We are resolving cases quickly in the spirit of the Disha Bill - Sakshi

ఆడపిల్ల పుడితే... అదృష్టం పుట్టిందని సంబరపడాలి. ఆడపిల్ల పెరుగుతుంటే... ఆ ఇంట్లో ఆనందం వెల్లి విరియాలి. ఆడపిల్ల ఆ ఇంటికి సంతోషం... ఆ ఇంటి వేడుకల కల్పవల్లి. ఆ సంతోషం... ఆనందం... అదృశ్యమై ఆందోళన రాజ్యమేలుతుందా? ఆడపిల్ల అమ్మానాన్నల గుండె ఆందోళనతో కొట్టుకుంటే ఆ తప్పెవరిది? మొదట సమాజానిది... ఆ తర్వాత చట్టానిది... ప్రభుత్వానిది. ప్రభుత్వం ఆ ‘దిశ’ గా అప్రమత్తమైంది... నేరగాళ్ల మీద కొరడా ఝళిపిస్తోంది.

అతడు 85 ఏళ్ల వృద్ధుడు, కోర్టు బోను ఎక్కడానికి కూడా దేహం సహకరించనట్లు ఆయాసపడుతున్నాడు. ఎట్టకేలకు అతడిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అతడి మీద నమోదైన కేసు గురించి తెలిసి పోలీసుల మీద న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ దగ్గరున్న ఆధారాలు సమర్పించారు. ఆ ఆధారాలను చూసిన న్యాయమూర్తి ఆగ్రహాన్ని అణచుకుంటూ తీర్పు రాశారు. ఆ తీర్పు పాఠం కోసం కోర్టు హాలు నిశ్శబ్దంగా చెవులు రిక్కించింది.

అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు న్యాయమూర్తి. సరైన తీర్పే వచ్చిందని ఊపిరి పీల్చుకున్నారంతా. అపరాధి మాత్రం ‘మన న్యాయవ్యవస్థ ఇంత త్వరగా తీర్పులు చెప్పేస్తోందా, మన పోలీసులు ఇంత త్వరగా కేసులు దర్యాప్తు చేసేసి బలమైన ఆధారాలు సేకరించి శిక్ష పడేవరకు విశ్రమించడం లేదా! కేసు కోర్టుకు రావడానికి ఏ పుష్కరకాలమో పడుతుందనుకుంటే... వీళ్లకిదేం పోయేకాలం...’ అన్నట్లు అసహనంగా చూశాడు.

బాధితురాలు మూడేళ్ల పాపాయి. తనకేం జరిగిందో తనకు తెలియదు. రోజూ తాను ఆడుకునే పక్కింటి తాతయ్య తన మీద ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో కూడా తెలియని పసితనం ఆ పాపాయిది. ఈ జ్ఞాపకాలేవీ తన బిడ్డకు గుర్తుండకూడదని కూతుర్ని తన వైపు తిప్పి గట్టిగా హత్తుకుంది. కోర్టు దృశ్యం పాపాయి మెదడులో నిక్షిప్తం కాకూడదని దేవుణ్ని ప్రార్థిస్తోంది పాపాయి తల్లి.  

సంఘటన జరిగిన ఆరు రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేశారు ‘దిశ’ పోలీసులు. తొమ్మిది నెలల్లో నిందితుడికి శిక్ష పడింది. ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను నివారించేందుకు దిశ పోలీసులు చేస్తున్న యజ్ఞమిది.  
∙∙∙
అది నేపాల్‌ నుంచి వచ్చి మన దగ్గర స్వెట్టర్‌లు అమ్ముకుంటున్న కుటుంబం. వాళ్లకు నాలుగున్నరేళ్ల పాపాయి. ఆటపాటల్లో మునిగిపోయి ఆకలైనప్పుడు అమ్మ కోసం వెతుక్కునే వయసది. ఆ పరిసరాల్లో నివసించే ఓ వ్యక్తి కళ్లు ఆ పాపాయి మీద పడ్డాయి. ‘నీకు టీవీ చూపిస్తాను’ అని లోపలికి తీసుకువెళ్లాడు.  

కేసు వెలుగులోకి వచ్చింది. టీవీ చూపిస్తూ, చాక్లెట్‌లు ఇచ్చి ఎలా మాయచేశాడో చెప్పడానికి పాపాయి ప్రయత్నిస్తోంది. కానీ పాపాయికి, వాళ్ల తల్లిదండ్రులకు తెలుగు రాదు, ఇంగ్లిష్‌ రాదు. ఏం జరిగిందనేది పోలీసులకు అర్థమవుతోంది. కానీ పాపాయి చేత చెప్పించి కేసు రికార్డు చేయించక తప్పదు. నేపాలీ ట్యూటర్‌ని పిలిపించి కేసు రికార్డు చేశారు. ఎనిమిది రోజుల్లో చార్జిషీట్‌ వేయగలిగారు. మెడికల్‌ సర్టిఫికేట్‌లు కోర్టుకు సమర్పించడం వంటి ప్రక్రియ మొత్తం వేగంగా జరిగి పోయింది. ఏడు నెలల్లో నిందితుడికి జీవితఖైదు పడింది. అలాగే మరో పన్నెండేళ్ల అమ్మాయిని వ్యూహాత్మకంగా పడుపు వృత్తిలోకి దించిన ఉదంతంలో ఏకంగా 74 మందిని అరెస్టు చేశారు. వారిలో యూఎస్‌కి వెళ్లబోతున్న టీసీఎస్‌ ఉద్యోగి కూడా ఉన్నాడు. యూకేలో ఉన్న ఒక నిందితుడు, ఇండియాలోనే ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు దిశ పోలీసులు.
∙∙∙
ఆ బిల్లు దిశగా దర్యాప్తు
గుంటూరు, దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏఎస్‌పీ సుప్రజ పై కేసుల దర్యాప్తును వివరిస్తూ... ‘‘మేము దిశ బిల్లు స్ఫూర్తితో కేసులను సత్వరం పరిష్కరిస్తున్నాం. పై కేసుల్లో కూడా నేరగాళ్లకు శిక్ష పడితీరాలన్నంత ఆవేశంతో పని చేశాం. పసిబిడ్డల పట్ల ఆ దుర్మార్గులు వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరం. మరొకరు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకూడదన్నంత సీరియెస్‌గా పని చేస్తున్నాం.

నేరం జరిగిన విషయం నిజమే అయినప్పటికీ న్యాయపోరాటంలో కొన్నిసార్లు మేము దఖలు పరిచిన ఆధారాలు వీగిపోతుంటాయి. అందుకే కొన్ని ఆధారాలను అత్యంత గోప్యంగా ఉంచి నేరుగా కోర్టులో బయటపెట్టాను. ఎనభై ఐదేళ్ల వృద్ధుడు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కోర్టులో అతడి నటన కూడా ఆస్కార్‌కు దీటుగా ఉండింది. దాంతో జడ్జిగారు మమ్మల్నే సందేహించారు కూడా. అప్పుడు నేను వీడియో బయటపెట్టడంతో కేసు నిలిచింది’’ అన్నారు సుప్రజ.
 
దిశ బస్సులు

పోలీస్‌ ఉద్యోగం చేస్తున్న మహిళలకు వృత్తిపరమైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బందోబస్తు డ్యూటీకి వెళ్లినప్పుడు విఐపీ రావడానికి నాలుగు గంటల ముందే ఆ ప్రదేశంలో ఉండాలి. ప్రోగ్రామ్‌ పూర్తయి, అందరూ వెళ్లిపోయే వరకు డ్యూటీ ఉంటుంది. కనీసం ఏడెనిమిది గంటలు పడుతుంది. ఏ ఒకటి – రెండు చోట్లనో తప్ప బాత్‌రూమ్‌ వంటి సౌకర్యాలు ఉండవు. మహిళలకు అన్ని రోజులూ ఒకటిగా ఉండవు. కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి.

వారి కష్టాలను అర్థం చేసుకుని సీయెం వారికి ‘దిశ బస్సు’ల రూపంలో మొబైల్‌ టాయిలెట్‌ల సౌకర్యం కల్పించి మహిళాపోలీసుల కష్టాలను దూరం చేశారు. ‘ఈ మేలును మేము ఎప్పటికీ మర్చిపోలేమ’ని అంటున్నారు మహిళాపోలీసులు. దిశ కేసుల విషయంలో కూడా ఇనుమడించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. బిల్లు ఇంకా చట్టం రూపం సంతరించుకోలేదు. దిశ పోలీస్‌స్టేషన్‌లు, దిశ పోలీసులు మాత్రం ఆ బిల్లును స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తున్నారు. న్యాయపోరాటంలో బాధితుల పక్షాన నిలుస్తున్నారు.  

కొన్నింటికి ఆధారాలుండవు!
చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అనే కాదు... మొత్తంగా ఆడవాళ్ల మీద జరిగిన నేరాన్ని రుజువు చేయడం చాలా కష్టం. ముందు సమాజమే అంగీకరించడానికి సిద్ధంగా ఉండదు. పైన వృద్ధుడి విషయంలోలాగానే సమాజం పోలీసులనే సందేహిస్తుంది. మహిళల విషయంలో కూడా మొదట బాధితురాలినే తప్పు పడుతుంది. ఈ నెగిటివ్‌ ఆటిట్యూడ్‌ తొలగిపోవాలి. ప్రతి కేసుకీ వీడియోలు ఉండవు. కానీ నేరం జరిగి ఉంటుంది. మహిళను తేలికగా మాట్లాడే ముందు జరిగిన అన్యాయాన్ని కనీసంగా అర్థం చేసుకోవడానికి అయినా ప్రయత్నించాలి.
– సుప్రజ, అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్, ఇన్‌చార్జ్, వెస్ట్‌ సబ్‌ డివిజన్, దిశ పోలీస్‌ స్టేషన్,గుంటూరు

– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top