
ఇస్లాం వెలుగు
పూర్వం బాగ్దాద్ నగరంలో బహెలూల్ అనే పేరుగల ఒక దైవభక్తుడు ఉండేవాడు. ఒకసారి ఆయన బాగ్దాద్ వీధుల్లో నడుస్తూ వెళుతున్నారు. అలా వెళుతూ వెళుతూ ఒకచోట విశ్రాంతి కోసం ఆగాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా బాధగా, ఆందోళనగా ఉన్నాడు. అది గమనించిన బహెలూల్ , ‘ఏమిటి చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు, విషయం ఏమిటి?’ అని ఆరా తీశారు.
‘అయ్యా.. ఏం చెప్పమంటారు? కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి దగ్గర కొంత పైకం అమానతుగా ఉంచాను. ఇప్పుడు వెళ్ళి అడిగితే, అసలు నువ్వెవరివి..? నాకు పైకం ఎప్పుడిచ్చావు?’ అని బుకాయిస్తున్నాడు. ఎంత ప్రాధేయపడినా కనికరించకుండా, ఇష్టమొచ్చినట్లు తిట్టిపోశాడు. కాని నా అమానత్తును మాత్రం తిరిగి ఇవ్వలేదు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి..? రిక్తహస్తాలతో మిగిలాను. ఏ మార్గమూ కానరావడం లేదు.’ అంటూ బోరుమన్నాడు. బహెలూల్ అతణ్ణి ఊరడిస్తూ.., ‘నువ్వేమీ బాధపడకు..దైవ చిత్తమైతే ఆ పైకం నేను ఇప్పిస్తాను.’ అన్నారు ప్రశాంతంగా..
‘అవునా..! నా పైకం ఇప్పిస్తారా..?’ అంటూ ఆశగా చూశాడా వ్యక్తి.. ‘‘కాని ఎలా సాధ్యం? ఆవ్యక్తి పరమ దుర్మార్గుడు... నాకైతే ఏమాత్రం నమ్మకం కుదరడంలేదు.’ అన్నాడు నిరాశతో.. ‘‘అలా అనకు.. నిరాశ తిరస్కారం
( కుఫ్ర్ )తో సమానం.. దైవచిత్తమైతే నీ పైకం నీకు తప్పకుండా లభిస్తుంది.’ అన్నారు బహెలూల్. ’నిజమే.. ఆశ లేకపోతే మనిషి బ్రతకలేడు. కాని.. ఎలా సాధ్యమో కూడా అర్ధం కావడం లేదు.’
’నువ్వు ఆందోళన చెందకు. నేను చెప్పినట్లు చెయ్ . నీ పైకం ఇప్పించే పూచీనాది.’ అన్నారు బహెలూల్ ధీమాగా..
’సరే ఏం చేయమంటారో చెప్పండి. ’అన్నాడతను. ఆశగా.. ’రేపు ఉదయం ఫలానా సమయానికి నువ్వు ఆ వ్యక్తి దుకాణం దగ్గరికిరా.. నేనూ ఆ సమయానికి అక్కడికి వస్తాను. నేను ఆ వ్యక్తితో మాట్లాడుతున్న క్రమంలో నువ్వొచ్చి నీ అమానత్తును అడుగు.’ అన్నారు బహెలూల్ . సరేనంటూ ఆ వ్యక్తి బహెలూల్ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.
తెల్లవారి ఉదయం బహెలూల్ ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నారు. కాసేపు అవీ ఇవీ మాట్లాడిన తరువాత, తాను కొన్నాళ్ళపాటు పని మీద ఎటో వెళుతున్నానని, కాస్త ఈ సంచి మీదగ్గర ఉంచితే తిరిగొచ్చిన తరువాత తీసుకుంటానన్నారు. ఇందులో వంద బంగారునాణాలు, కొంతనగదు ఉందని చెప్పారు. ఆ వ్యక్తి లోలోన సంతోషపడుతూ, సరేనని సంచీ అందుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి మోస΄ోయిన వ్యక్తి వచ్చి తను అమానతుగా ఉంచిన పైకం ఇమ్మని అడిగాడు. ఆ వ్యాపారి ఒక్కక్షణం ఆలోచించి, ఇప్పుడు గనక ఇతనితో పేచీ పెట్టుకుంటే, విలువైన బంగారు నాణాల సంచి చేజారే అవకాశముందని గ్రహించాడు. వెంటనే అతని పైకం అతనికిచ్చేశాడు. అతను సంతోషంగా పైకం తీసుకొని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. బహెలూల్ కూడా తన సంచిని వ్యాపారి దగ్గర అమానత్తుగా ఉంచి తనదారిన తను వెళ్ళిపోయారు.
కొంతసేపటి తరువాత, అతడు సంబరపడుతూ, బహెలూల్ దాచిన నాణాల సంచి విప్పి చూసి, నోరెళ్ళబెట్టాడు. అందులో గాజు పెంకులు, గులక రాళ్ళు తప్ప మరేమీ లేవు. తను చేసిన మోసానికి తగిన శాస్తే జరిగిందని భావించాడు. ఇకనుండి ఎవరినీ మోసం చేయకూడదని నిర్ణయించుకొని ధర్మబద్ధమెన జీవనం ప్రారంభించాడు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్∙