
పెరిగిన పొగాకు ధర
దేవరపల్లి: మార్కెట్లో పొగాకు ధర పెరిగింది. ధర రోజురోజుకు పెరుగుతోంది. జూన్ 24 వరకు కిలో గరిష్ఠ ధర రూ. 290 ఉండగా, అనంతరం ఈ ధర రోజు రోజుకు పెరుగుతూ రైతుల్లో ఆశలు కల్పిస్తోంది. ముందు ముందు ధర మరింత పెరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. మార్చి 24న పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించింది. కిలో గరిష్ఠ ప్రారంభ ధర రూ.290 ఉండగా, అప్పటి నుంచి జూన్ 24 వరకు అదే ధర కొనసాగింది. దీంతో ధర గిట్టుబాటు కాక రైతులు ఆందోళన చెందారు. ఈ నెల 25 నుంచి మార్కెట్లో ధర స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. జూన్ 24న కిలో గరిష్ఠ ధర రూ. 290 పలకగా, 26న రూ. 291, 26న రూ. 293, 27న రూ. 296, 28న రూ.299, 30న 300, జూలై 1న కిలో గరిష్ఠ ధర రూ.300 పలకగా బుధవారం మార్కెట్లో కిలోకు గరిష్ఠ ధర రూ. 10 పెరిగి రూ.310 చేరుకుకుంది. ఒక్కరోజునే కిలోకు రూ.10 పెరగడంతో రైతులకు ఊరట లభించినట్లయింది. గత ఏడాది కిలో గరిష్ఠ ధర రూ.410 పలికింది. మార్కెట్లో ధర పెరుగుతుండడంతో వేలానికి వస్తున్న బేళ్ల సంఖ్య పెరుగుతోంది. గురువారం వేలానికి ఐదు వేలం కేంద్రాల నుంచి 5,171 బేళ్లు విక్రయానికి రాగా, 3,758 బేళ్లు కొనుగోలు చేశారు. 1,413 బేళ్లు అమ్ముడు పోలేదు. 4.76 లక్షల కిలోల పొగాకు విక్రయం జరిగినట్టు బోర్డు అధికారులు తెలిపారు. కిలో గరిష్ఠ ధర రూ.310, కనిష్ఠ ధర రూ.200, సగటు ధర రూ.275.10 లభించింది. ఇప్పటి వరకు 80 రోజులు వేలం జరిగింది. 16 కంపెనీలు వేలంలో పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు.
కిలో గరిష్ఠ ధర రూ.310
ఒక్కరోజులో పెరిగిన ధర రూ.10