
మధ్యాహ్న భోజనం అమలులో అలసత్వం వద్దు
రికార్డుల నిర్వహణపై
రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుల అసంతృప్తి
కరప: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలులో అలసత్వం వహించవద్దని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్, ఈ.లక్ష్మీరెడ్డి నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేశారు. కోడిగుడ్లు ఎక్కువ నిల్వ ఉండటం, విద్యార్ధులకు దొడ్డుబియ్యంతో భోజనం పెట్టడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంపై కమిషన్ సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. బుధవారం వారు మండల అధికారులతో కలసి కరప మండలంలో అంగన్‌వాడీ కేంద్రాలను, హైస్కూలు, రేషన్ షాపులను, ఎంఎల్‌సీ పాయింట్‌ను తనిఖీ చేశారు. కొరిపల్లిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. 3వ, 4వ ఫేజ్‌లో వచ్చిన 140 కోడిగుడ్లు ఎక్కువ ఉండటాన్ని గుర్తించారు. అంగన్‌వాడీ టీచర్‌కు షోకాజ్ నోటీసు జారీచేయాలని సీడీపీఓ వై.లక్ష్మిని ఆదేశించారు. కూరాడ జెడ్పీ హైస్కూల్‌లో దొడ్డు బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టటం ఏమిటని హెచ్‌ఎం ప్రశ్నించారు. షోకాజ్ నోటీసు జారీచేయాలని ఎంఈఓ కె.బుల్లికృష్ణవేణిని ఆదేశించారు.