
గవర్నర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
కాకినాడ సిటీ: కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ 11వ స్నాతకోత్సవానికి శుక్రవారం విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్‌లో గవర్నర్ అబ్ధుల్ నజీర్ కాకినాడ పర్యటన సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీనాతో కలిసి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. సంబంధిత అధికారులు చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. జేఎన్టీయూ 11వ స్నాతకోత్సవానికి గవర్నర్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన జేఎ న్టీయూ అతిథి గృహానికి చేరుకుంటారన్నారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు సెమినార్ హాల్లో నిర్వహించే స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్శిటీ అధికారులు పాల్గొన్నారు.