
నేడు వ్యూహలక్ష్మికి మహాభిషేకం
సీటీఆర్‌ఐ: వ్యూహలక్ష్మి అమ్మవారికి గురువారం మహాభిషేకం జరుగుతుందని శ్రీమాన్ చిన్నవెంకన్నబాబు స్వామి అన్నారు. బుధవారం స్థానిక ట్రస్ట్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గాడాల శ్రీమహాలక్ష్మీ సమేత చిన్న వేంకటేశ్వరస్వామి పీఠంలో ప్రతి ఏడాది ఆషాఢ మాస రెండో గురువారం శ్రీవ్యూహలక్ష్మి అమ్మవారికి ఈ ఒక్కరోజు మాత్రమే విశేష మహా భిషేకం జరుగుతుందన్నారు. భక్తులంతా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని అన్నారు. ఈ గుప్త నవరాత్రుల్లో భాగంగా గురువారం వ్యూహలక్ష్మికి మహాభిషేకం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఆటంకాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయని అనుగ్రహ ప్రద ఫౌండేషన్ అంతర్జాతీయ వైస్ చైర్మన్ సింగంశెట్టి మహితోష్ తెలిపారు. మనగుడి– మనసేవ భారతీయ ఆధ్యాత్మిక సేవా సమితి ఉభయ రాష్ట్రాల చైర్మన్ మతల రమేష్ మాట్లాడుతూ గత సంవత్సరం గుప్త నవరాత్రులకు ఎంతోమంది భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ నుంచి విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అయ్యారన్నారు. కార్యక్రమంలో పీఠం వైస్ చైర్మన్ దుర్గా వెంకట హేమావతి తదితరులు పాల్గొన్నారు.